Kodanda Ramalayam : కోదండుని స‌న్నిధిలో ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ

ఘ‌నంగా ప‌విత్రోత్స‌వాలు

Kodanda Ramalayam : తిరుప‌తిలో కొలువైన శ్రీ కోదండ‌రామ స్వామి వారి ఆల‌యంలో(Kodanda Ramalayam) ప‌విత్రోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. రాత్రి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు పూజారులు. ఉద‌యం స్వామి వారిని సుప్ర‌భాతంతో మేల్కొలిపి తోమాల సేవ‌, స‌హ‌స్ర నామార్చన చేప‌ట్టారు. అనంత‌రం సీతా ల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ రాముల వారి ఉత్స‌వ‌ర్ల‌ను యాగ‌శాల‌కు వేంచేపు చేశారు. అక్క‌డ విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ వ‌చ‌నం, కుంభారాధ‌న‌, ఉక్త హోమాలు జ‌రిపించారు.

ఈ సంద‌ర్బంగా ఉత్స‌వ మూర్తుల‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం వేడుకగా నిర్వ‌హించారు. ఇందులో ఉత్స‌వ మూర్తుల‌కు పాలు, పెరుగు, తేనె, చంద‌నం, కొబ్బ‌రి నీళ్ల‌తో అభిషేకం చేప‌ట్టారు. యాగ‌శాల‌లో పవిత్ర మాల‌ల‌కు ఉప‌చారాలు నిర్వ‌హించి ప్ర‌ద‌క్షిణ‌గా స‌న్నిధికి వేంచేపు చేశారు.

ధ్రువ మూర్తులు, కౌతుక మూర్తులు, స్న‌ప‌న మూర్తుల‌కు, బ‌లి మూర్తుల‌కు ప‌విత్రాలు స‌మ‌ర్పించారు. అదేవిధంగా విష్వక్సేన‌, ద్వార పాల‌కులు, భాష్య కార్లు, గ‌రుడాళ్వార్ , యాగ శాల లోని హోమ గుండాలు, బలిపీఠం ధ్వ‌జ‌స్తంభం , ఆల‌యం ఎదురుగా గ‌ల ఆంజ‌నేయ స్వామి వారికి ప‌విత్రాలు స‌మ‌ర్పించారు.

శ్రీ సీతారామ ల‌క్ష్మ‌ణులు బంగారు తిరుచ్చిపై ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇచ్చారు. యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

Also Read : Tirumala Break Darshan : 17న బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!