ED Raids in Haryana: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో భారీగా తుపాకులు..!
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో భారీగా తుపాకులు..!
ED Raids in Haryana: అక్రమ మైనింగ్ కేసులో హర్యానాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్, మాజీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డి) ఎమ్మెల్యే దిల్ బాగ్ సింగ్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 20 చోట్ల నిర్వహించిన ఈ సోదాల్లో భారీగా నగదు, తుపాకులు, బంగారం, విదేశీ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సురేందర్ పన్వార్, దిల్ బాద్ సింగ్ ఇళ్ళతో పాలు వారి అనుచరుల ఇళ్ళల్లో గురువారం ప్రారంభమైన ఈ సోదాడు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు ఐదు కోట్ల నగదు, ఐదు కిలోల బంగారు ఆభరణాలు, సుమారు 300 విదేశాలల్లో తయారైన తుపాకులు, 100కు పైగా మద్యం బాటిళ్ళను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయ్యేసరికి మరింత నగదు, బంగారం బయటపడవచ్చని తెలుస్తోంది.
ED Raids in Haryana MLA’s House
సోనిపట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్, యమునానగర్ మాజీ ఎమ్మెల్యే దిల్ బాగ్ సింగ్ కలిసి గతకొంతకాలంగా మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. యమునానగర్ మరియు చుట్టు ప్రక్కల జిల్లాల్లో వీరిద్దరు నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున వీరు మైనింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు లీజు గడువు ముగిసిన తరువాత నిర్వహించిన మైనింగ్ కు సంబంధించిన పన్నులను కూడా ఎగవేసినట్లు పెద్ద ఎత్తున వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే మైనింగ్ పన్నులు, రాయల్టీల వసూలుకు సంబంధించిన పారదర్శకత కోసం 2020లో హర్యానా ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ‘ఇ-రావన్’ పథకంలో కూడా వీరు అవకతవకలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలపై అందిన ఫిర్యాదుల మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు కేసులు నమోదు చేసి సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) నిబంధనల ప్రకారం యమునానగర్, సోనిపట్, మొహాలీ, ఫరీదాబాద్, చండీగఢ్ మరియు కర్నాల్ లలోని ఈ ఇద్దరు రాజకీయ నాయకులతో పాటు వారి సన్నిహితులతో సంబంధం ఉన్న 20 స్థానాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నగదు, బంగారం, తుపాకులు, విదేశీ మద్యం తో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ధనవంతులైన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో పన్వార్, సింగ్
2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అత్యంత ధనవంతులైన అభ్యర్థుల్లో సురేందర్ పన్వార్, దిల్ బాగ్ సింగ్ ఉన్నారు. పన్వార్ మొత్తం ఆస్తులను రూ.27 కోట్లుగా ప్రకటించగా, సింగ్ రూ.34 కోట్ల ఆస్తులను ప్రకటించారు. 2019 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున సోనిపట్ లో పోటీ చేసిన పన్వార్… బిజెపికి చెందిన కవితా జైన్‌ను 32,000 ఓట్ల తేడాతో ఓడించారు. ఐఎన్ఎల్డి తరపున యమునానగర్‌లో పోటీ చేసిన దిల్ బాగ్ సింగ్ మాత్రం…. బిజెపికి చెందిన ఘనశ్యామ్ దాస్ చేతిలో 1,400 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.
Also Read : Vallabbhaneni Balashowry : వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడటం ఖాయమా..?