TDP MP Kesineni Nani: చంద్రబాబుకు కేశినేని నాని షాక్ ! త్వరలో టీడిపీకి రాజీనామా ?

చంద్రబాబుకు కేశినేని నాని షాక్ ! త్వరలో టీడిపీకి రాజీనామా ?

TDP MP Kesineni Nani: తెలుగుదేశం పార్టీలో విజయవాడ రాజకీయాలు రచ్చకెక్కాయి. విజయవాడ ఎంపీ కేశినేని నానికు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కేటాయించడంపై ధిక్కార స్వరం వినిపిస్తున్న టిడిపి అధిష్టానానికి… నాని కూడా అదే శైలిలో సమాధానం ఇస్తున్నారు. తన అవసరం లేని పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని… కాబట్టి తన ఎంపీ పదవికి, పార్టీకు రాజీనామా చేస్తానని కేశినేని నాని తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం కేశినేని నాని సోషల్ మీడియాలో చేసిన పోస్ట్… టిడిపితో పాటు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఒకవైపు అధికార వైసిపిలో టిక్కెట్టు పంచాయితీలు రాష్ట్ర రాజకీయాల్లో కాకపుట్టిస్తుంటే… మరోవైపు టీడిపీలో ప్రారంభమైన విజయవాడ ఎంపీ టిక్కెట్టు రచ్చ ఎన్నికల వేడిని రాజేస్తుంది.

TDP MP Kesineni Nani – వైరల్ గా మారుతున్న కేశినేని ట్వీట్

‘‘అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి పార్టీకు నా అవసరం లేదని తెలిసిన తరువాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్‌ కాదని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి నా లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరుక్షణమే పార్టీకు రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నా’’ అంటూ ఎంపీ కేశినేని నాని తన ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా వెల్లడించారు. అంతేకాదు కేశినేని నాని, చంద్రబాబు, భువనేశ్వరితో ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేసారు. ప్రస్తుతం కేశినేని నాని చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

చంద్రబాబుపై నాని వ్యంగ్యాస్త్రాలు

వచ్చే ఎన్నికల్లో కేశినేనికి టిక్కెట్టు లేదని తమ నాయకుల ద్వారా అధిష్టానం సమాచారం చేరవేస్తే… నాని మాత్రం తన సోషల్ మీడియా వేదికగా పార్టీ హైకమాండ్ కు ఘాటైన సమాధానాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా ఇస్తున్న సమాధానాలు, వ్యంగంతో కూడిన విమర్శలు తెలుగుదేశం పార్టీకు తలనొప్పిగా మారాయి. అసలు విషయానికి వస్తే కొంతకాలంగా టీడిపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని)కి(Kesineni Nani) వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం కేటాయించడంపై టీడిపి అధిష్టానం పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలోనే నాని స్థానంలో వేరే వ్యక్తిని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉండగా ఈ నెల 7న ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో పార్టీ అధినేత చంద్రబాబు ‘రా.. కదలిరా!’ బహిరంగ సభ ఏర్పాట్ల విషయంలో కేశినాని నాని, అతని సోదరుడు చిన్ని వర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తిరువూరు ఇన్ చార్జి, దళిత నాయకుడు దేవదత్ ను ఉద్దేశ్యించి పూజకు పనికిరాని పువ్వు అంటూ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) ఘాటు వ్యాఖ్యలు చేసారు. నాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపికు చెందిన కొంతమంది దళిత నాయకులు, టిడిపి అధినేత చంద్రబాబు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయడంతోనే ఈ సభకు దూరంగా ఉండాలంటూ నానికి పార్టీకు చెందిన నాయకుల ద్వారా సమాచారం అందించారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానం కంటే ముందే కేశినేని నాని(Kesineni Nani) తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నేపధ్యంలో పార్టీ అధినేత నిర్ణయాన్ని శిరసావహిస్తానని ప్రకటించారు.

చంద్రబాబును హిట్లర్ తో పోల్చిన నాని

అయితే ఇది జరిగి 24 గంటలు తిరగకముందే మీడియాతో మాట్లాడిన కేశినేని నాని ‘దిల్లీ వెళ్లాలంటే ఒక విమానం కాకపోతే మరొకటి. అదీ కాకపోతే ప్రైవేటు జెట్‌లో వెళ్లవచ్చు. ప్రస్తుతానికి ప్రైవేటు జెట్‌ స్తోమత లేదు. దిల్లీ మాత్రం తప్పక వెళతా. నిజాయతీగా రాజకీయాలు చేశా. ఆస్తులు అమ్ముకున్నా. వ్యాపారాలు మానుకున్నా. నేను చంద్రబాబుకు వెన్నుపోటు పొడవలేదు. అలా చేస్తే మంచి పదవిలో ఉండేవాడిని. ప్రస్తుతానికి చంద్రబాబు బాస్‌. ఆయన మాట వింటాను. బాస్‌ ఎప్పుడూ కరెక్టేగా. జర్మనీ నాశనం అయ్యేంత వరకు హిట్లర్‌ ఏం చెప్పినా కరెక్టేగా’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో విజయవాడ(Vijayawada) నుంచే పోటీ చేస్తానని.. తప్పక గెలుస్తానని.. స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచే సత్తా తనకు ఉందని పేర్కొన్నారు. అంతేకాదు దీనికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారి పార్టీకు నా అవసరం లేదని తెలిసిన తరువాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్‌ కాదని నా భావన. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్‌సభ స్పీకర్‌ను కలిసి నా లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి మరుక్షణమే పార్టీకు రాజీనామా చేస్తానని సోషల్ మీడియాలో ప్రకటించడం సంచలనంగా మారింది.

Also Read : TSRTC New Buses : సంక్రాంతికి టీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక బస్సులు

Leave A Reply

Your Email Id will not be published!