Sajjala Ramakrishna Reddy: షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది- సజ్జల
షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది- సజ్జల
Sajjala Ramakrishna Reddy: దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక టీడీపి అధినేత చంద్రబాబు కుట్ర ఉందని వైఎస్సాఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టడం కలే అని గ్రహించిన చంద్రబాబు… దింపుడుకళ్లెం ఆశలతో ఈ కుట్రకు పాల్ప డ్డారని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ను చేతిలో పెట్టుకున్న చంద్రబాబు… తన మనుషుల ద్వారా ఒక వైపు కాంగ్రెస్‌ను.. మరో వైపు బీజేపీని మేనేజ్ చేస్తున్నారని, మీడియా ద్వారా ప్రజల దృష్టి మళ్లించేందుకు రకరకాల కుట్రలు చేస్తున్నారని ద్వజమెత్తారు. ఈ కుట్రలో భాగంగానే షర్మిలను కాంగ్రెస్ లో చేర్పించారన్నారు.
షర్మిల సీఎం రమేశ్ విమానంలో వెళ్లడం… టీడీపీ నేత బీటెక్ రవిని, బ్రదర్ అనిల్ కలవడం యాదృచ్ఛికమని తాము అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేసారు. క్రిస్టియన్ ఓట్లను ప్రభావితం చేయడానికి కుట్రలు చేస్తున్నారంటూ గతంలో టీడీపీ నేతలు బ్రదర్ అనిల్‌పై ఏ స్థాయిలో దుమ్మెత్తిపోశారో ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసారు. టీడీపీ నేత బీటెక్ రవిని ఎయిర్‌పోర్ట్‌లో బ్రదర్ అనిల్ మర్యాదపూర్వకంగా కలవడం వంటి వాటన్నింటినీ పరిశీలిస్తే షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉంది అని అర్థమవుతోందన్నారు.
Sajjala Ramakrishna Reddy – వైఎస్ మరణంపై మాకు కాంగ్రెస్ పై అనుమానాలున్నాయి – సజ్జల
మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై సంబంధించి కాంగ్రెస్ పై తమకు అనుమానాలు ఉన్నాయని ఈ సందర్భంగా సజ్జల మరోసారి పునరుద్ఘాటించారు. అంతేకాదు వైఎస్ మరణం తర్వాత అప్పట్లో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుమ్మక్కై జగన్‌పై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ మరణించినప్పటి నుంచి చంద్రబాబు తెరవెనుక కాంగ్రెస్‌తో సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారని సజ్జల ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్‌ను ఎన్నికల్లో నేరుగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని.. ఆ కుట్రలో భాగంగానే షర్మిల చేరికని ఆరోపించారు. వైఎస్సార్ పేరుతో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి, పార్టీ పెట్టి, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా ఆపార్టీ లో చేరడం షర్మిల ఇష్టమని సజ్జల అన్నారు. అండమాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ ఎక్కడైనా పని చేస్తానని ఆమె అన్నారని, రాష్ట్రంలోనే రాజకీయం చేస్తానని ప్రకటించలేదన్నారు. ఒకవేళ రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ నాయకురాలిగానే చూస్తామని ఆయన స్పష్టం చేసారు.
Also Read : Telangana Ex CM KCR: ఫిబ్రవరి నుండి జనంలోకి కేసీఆర్ ?