Congress Leader Rahul Gandhi: అస్సాం సీఐడీకి రాహుల్ గాంధీ కేసు !
అస్సాం సీఐడీకి రాహుల్ గాంధీ కేసు !
Congress Leader Rahul Gandhi: భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై అస్సాంలో నమోదైన క్రిమినల్ కేసును గువాహటి పోలీసులు సీఐడీకి బదిలీ చేశారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయడం కోసం సీఐడీకి బదిలీ చేసినట్లుగా అస్సాం డీజీపీ జీపీ సింగ్ తన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలిపారు. ఈ కేసులో సమగ్రమైన, లోతైన విచారణకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనితో రాహుల్ గాంధీపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేయడం, దానిని తిరిగి సీఐడీకు బదిలీ చేయడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాగా రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. అస్సాం నుంచి బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లాలోకి రాహుల్ అడుగుపెట్టారు. ఈ సందర్బంగా అస్సాం-పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కు స్వాగతం పలికారు.
Congress Leader Rahul Gandhi – అసలు రాహుల్ గాంధీపై కేసు ఎందుకు నమోదు అయిందంటే ?
భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీపై(Rahul Gandhi) అస్సాంలో పాదయాత్ర చేపడుతున్నారు. దీనిలో భాగంగా గువాహటి నగరంలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ కారణాల దృష్ట్యా నగరంలో ఈ యాత్ర చేపట్టేందుకు అనుమతి లేదంటూ… అందుకు బదులుగా బైపాస్ నుంచి వెళ్లాలని పోలీసులు సూచించారు. ఈ క్రమంలోనే యాత్ర నగరంలోకి ప్రవేశించకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు. అయితే, కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తోసుకుని ముందుకు దూసుకెళ్లారు. దీనితో పోలీసులు, పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.
నిబంధనలకు విరుద్ధంగా గువాహటి నగరంలోకి రాహుల్ ప్రవేశించడాన్ని సీరియస్ గా తీసుకున్న అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ… సమూహాన్ని రాహుల్(Rahul Gandhi) రెచ్చగొట్టారని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీనితో అస్సాంలో ఘర్షణలు సృష్టించినందుకు… హింస, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడికి పురిగొల్పినందుకు వంటి పలు ఆరోపణలతో రాహుల్, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై 9 క్రిమినల్ కేసులు నమోదు చేసారు. ఈ సందర్భంగా యాత్ర పేరుతో అస్సాంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాంగ్రెస్ ఉద్దేశమని… ఈ కేసుకు సంబంధించి లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్టు చేస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. కాగా ఆ కేసును సీఐడీకు బదిలీ చేస్తూ రాష్ట్ర డీజీపి జీపీ సింగ్ తన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా ప్రకటించారు.
Also Read : Lok Sabha Elections 2024 : మోదీని మల్లి గెలిపించుకుందాం అంటూ వైరల్ అవుతున్న వీడియోలు