Akhilesh Yadav: కాంగ్రెస్ కు అఖిలేష్ యాదవ్ ఓపెన్ ఆఫర్ ! 17 సీట్లు ఫైనల్ !
కాంగ్రెస్ కు అఖిలేష్ యాదవ్ ఓపెన్ ఆఫర్ ! 17 సీట్లు ఫైనల్ !
Akhilesh Yadav: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమిలో ఉన్న సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్… కాంగ్రెస్ పార్టీకు బహిరంగ ఆఫర్ ప్రకటించారు. ఇంటియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకు ఉత్తరప్రదేశ్ లో 17 సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేసారు. దానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరిస్తే… మంగళవారం రాయబరేలీలో జరగబోయే రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లో పాల్గొనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమాజ్‌వాదీ పార్టీ లేఖ రాసినట్లు తెలుస్తోంది.
Akhilesh Yadav Comment
సమాజ్ వాదీ పార్టీ అధిష్టానం… తన కూటమి భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ కు 11 సీట్లు కేటాయించాలని తొలుత భావించినప్పటికీ… కాంగ్రెస్ పార్టీ నుండి వస్తున్న వినతుల మేరకు ఆ సంఖ్యను 17కు పెంచాము. వారి అంగీకారాన్ని బట్టే రాయబరేలిలో రాహుల్ మంగళవారం జరిపే భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేష్(Akhilesh Yadav) పాల్గొనడం ఉంటుంది” అని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి మీడియాకు తెలిపారు. అయితే కాంగ్రెస్‌కు ఏయే సీట్లు ఆఫర్ చేశారనే విషయం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. అయితే సమాజ్ వాదీ పార్టీ ప్రకటించిన ఆఫర్ పై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందన రాలేదు.
ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న రాయబరేలీ, అమెథీ రెండు స్థానాలకు… గత ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ పోటీకు దూరంగా ఉంది. అయితే అమెథీలో బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమి పాలయ్యారు. దీనితో 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానం రాయబరేలీకు పరిమితం అయింది. ఇది ఇలా ఉండగా రాహుల్‌గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ సోమవారం అమేథీలోకి అడుగుపెట్టింది. మంగళవారం రాయబరేలి చేరుకుంటుంది. కాంగ్రెస్ ఆహ్వానాన్ని అఖిలేష్ గతంలో స్వాగతిస్తూ రాయబేరిలిలో జరిగే యాత్రలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ తన కండీషన్ కు అంగీకరిస్తేనే… రాయబరేలీలో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొననున్నట్లు ఎస్పీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Also Read : TSPSC Notification : తెలంగాణ యువతకు శుభవార్త..గ్రూప్-1 పోస్టులు విడుదల చేసిన సర్కార్