TDP-Janasena Alliance: ఫిబ్రవరి 28న టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభ !

ఫిబ్రవరి 28న టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభ !

TDP-Janasena Alliance: ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ చూడని విధంగా ఫిబ్రవరి 28న తెలుగుదేశం, జనసేన(Janasena) పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తాడేపల్లిగూడేం అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించే ఈ మహా బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుండి తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆయన తెలిపారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం అనంతరం జనసేన పీఏసీ చైర్మెన్ నాదేండ్ల మనోహర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడేం మహా బహిరంగ సభ ఏర్పాట్లను టీడీపీకి చెందిన ఆరుగురు, జనసేనకు చెందిన ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ చూసుకుంటుందని తెలిపారు. తాడేపల్లి గూడెంలో జరిగే ఉమ్మడి సభకు 6 లక్షల మంది వస్తారనే అంచనాతో సభకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

టీడీపీ, జనసేన పొత్తులను రాష్ట్ర ప్రజలు ఘనంగా స్వాగతిస్తున్నారని ఆయన స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ లో ఐదు కోట్ల మంది ప్రజలు జగన్ రెడ్డి పాలనతో విసుగు చెంది ఉన్నారన్నారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో వైసీపీను ఇంటికి పంపిచడానికి ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నరన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం సీఎం జగన్ తిరిగి అధికారంలోకి రాకూడదనే ఏకైక లక్ష్యంతో పొత్తు పెట్టుకున్నామని… టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోందని… త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు పోటీ చేయాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు… జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

క్షేత్ర స్థాయిలో టీడీపీ(TDP) – జనసేన మధ్య గ్యాప్ లేకుండా పని చేయాలని ఇరుపార్టీల కేడర్‌ కు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. టీడీపీ – జనసేన మధ్య వైసీపీ తగువులు పెట్టే ప్రయత్నం చేస్తోందని… ప్రజల మధ్యన కూడా జగన్ తగవులు పెడతున్నారని ఆరోపించారు. జగన్ అంత వరస్ట్ సీఎంను ఇప్పటివరకు చూడలేదని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని… ఏపీలో స్వేచ్ఛ లేకుండా పోయిందని మండిపడ్డారు. టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని… ఇంతవరకు జరిగిన చర్చల విషయంలో త్వరలో క్లారిటీ వస్తుందన్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదని అచ్చెన్నాయుడు తెలిపారు. పొత్తులు పెట్టుకునే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవని అధినేతలిద్దరూ చెప్పారని అన్నారు. టిక్కెట్లు కొల్పోయిన వాళ్లు బాధ పడొద్దని చంద్రబాబు, పవన్ చెబుతూనే ఉన్నారని అచ్చెన్నాయుడు అన్నారు.

TDP-Janasena Alliance – ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదనే పొత్తులు – నాదెండ్ల మనోహర్

ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశ్యంతో పొత్తులు పెట్టుకున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. సమన్వయం లోపం లేకుండా రెండు పార్టీలు ఎన్నికలు వెళ్లబోతున్నాయని అన్నారు. టీడీపీ(TDP) – జనసేన పార్టీలు కలిసి పని చేయాల్సి ఉంటుందని, అవసరమైతే త్యాగాలు కూడా చేయక తప్పదని చంద్రబాబు – పవన్ సూచిస్తున్నారని ప్రస్తావించారు. ఈ నెల 28వ తేదీన జరిగే సభ ఉమ్మడి సభలో రెండు పార్టీల నేతలు పాల్గొంటారని, ‘బై బై వైసీపీ’ అనేది ఓ నినాదంగా మారాలని కేడర్‌కు సూచించారు. రెండు నెలల్లో వైసీపీ విముక్త రాష్ట్రంగా మారుతుందని నాదెండ్ల మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు. యువత, మహిళలు, రైతులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలతో కూడిన మేనిఫెస్టో రూపొందిస్తామని, అభ్యర్థుల విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని తెలిపారు.

Also Read : AP Traffic Rules : ఏపీ వాహనదారులకు గమనిక..ఇక ఈ రూల్స్ పాటించకుంటే వాయింపే

Leave A Reply

Your Email Id will not be published!