Rohith Vemula: రోహిత్ వేముల కేసు పునర్విచారణ ప్రారంభం !
రోహిత్ వేముల కేసు పునర్విచారణ ప్రారంభం !
Rohith Vemula:హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఎనిమిదేళ్లకు కేసు పునర్విచారణ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకొంది. డీజీపీ రవిగుప్తా శుక్రవారమే ఆదేశాలు జారీ చేయడంతో సైబరాబాద్ పోలీసులు పునర్విచారణను ప్రారంభించారు. మరోవైపు రోహిత్(Rohith Vemula) తల్లి రాధిక, కుటుంబసభ్యులు, కొందరు విద్యార్థులు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. విచారణ సరిగ్గా జరగలేదని.. పలు అంశాల్ని పరిగణనలోకి తీసుకోలేదని సీఎం దృష్టికి తెచ్చారు. రోహిత్ ఆత్మహత్య అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో సస్పెన్షన్ కు గురైన విద్యార్థుల భవిష్యత్తు, వారిపై నమోదైన కేసుల గురించి ప్రస్తావించారు. నిష్పాక్షికంగా పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు.
Rohith Vemula:
అనంతరం సీఎం నివాసం బయట రాధిక మీడియాతో మాట్లాడుతూ… ‘బీజేపీకు అనుకూలంగా ఉన్న కొన్ని అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని కేసును మూసేశారు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుంది. సరిగ్గా చదవకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పడం సరైంది కాదు. మా వాడు చదువులో ముందుండేవాడు. ఎస్సీ కాదని పోలీసులు ఎలా ధ్రువీకరిస్తారు ? అది రెవెన్యూ యంత్రాంగం చెప్పాలి. యూనివర్సిటీ అప్పటి వీసీ అప్పారావు, బీజేపీ నేతలు దత్తాత్రేయ, రామచంద్రరావు, ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలి’ అని రాధిక డిమాండ్ చేశారు. ఏఐసీసీ ఎస్సీ విభాగం ఛైర్మన్ రాజేశ్ లిలోతియా సాయంత్రం రాధికను కలిశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే శిక్షించేందుకు రోహిత్ వేముల చట్టం తీసుకొస్తామని తెలిపారు.
Also Read :-H.D.Revanna: మహిళ కిడ్నాపింగ్ కేసులో హెచ్డీ రేవణ్ణ అరెస్ట్ !