Malla Reddy: భూకబ్జా కేసులో పోలీసులతో మాజీ మంత్రి మల్లారెడ్డి వాగ్వివాదం !
భూకబ్జా కేసులో పోలీసులతో మాజీ మంత్రి మల్లారెడ్డి వాగ్వివాదం !
భూకబ్జా కేసులో పోలీసులతో మాజీ మంత్రి మల్లారెడ్డి వాగ్వివాదం !
కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి కొంతమంది వ్యక్తులతో వాగ్వివాదానికి దిగారు. అయితే ఆ స్థలం తమదేనంటూ వీళ్లిద్దరినీ కొందరు అడ్డుకునే యత్నం చేయగా… పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. దీనితో రంగంలోనికి దిగిన కుత్బుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేసారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బారికెడ్లను తొలగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి-రాజశేఖర్‌రెడ్డిలకు వాగ్వివాదం జరిగింది. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు.
అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీనితో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం మల్లారెడ్డిని అదుపులోనికి తీసుకుని పేట్‌బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు.