Medha Patkar: పరువునష్టం కేసులో మేధా పాట్కర్ కు ఐదు నెలల జైలుశిక్ష !
పరువునష్టం కేసులో మేధా పాట్కర్ కు అయిదు నెలల జైలుశిక్ష !
Medha Patkar: ప్రముఖ సామాజిక వేత్త, నర్మదా బచావో ఆందోళన్(ఎన్బీఏ) నాయకురాలు మేధాపాట్కర్(Medha Patkar) ను పరువు నష్టం కేసులో దోషిగా తేలారు. ఈ కేసులో మేధా పాట్కర్ కు ఢిల్లీ కోర్టు అయిదు నెలల జైలు శిక్ష విధించింది. 23 ఏళ్ల క్రితం నాటి ఈ కేసును ప్రస్తుతం ఢిల్లీ ఎల్జీగా ఉన్న వీకే సక్సేనా దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాఘవ్ శర్మ ఈ ఏడాది మేలో ఆమెను దోషిగా నిర్ధరిస్తూ తీర్పు వెలువరించారు. తాజాగా అయిదు నెలల సాధారణ జైలు శిక్షను ఖరారు చేయడంతోపాటు రూ.10 లక్షల జరిమానా విధించారు. అయితే… ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు వీలుగా శిక్షను ఒక నెలపాటు నిలుపుదల చేశారు.
Medha Patkar Remand
మేధా పాట్కర్, వీకే సక్సేనాల మధ్య 2000 సంవత్సరం నుంచి న్యాయపోరాటం సాగుతోంది. తనతోపాటు ‘నర్మదా బచావో ఆందోళన్’కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై సక్సేనాపై ఆమె అప్పట్లో కేసు వేశారు. ఆ సమయంలో ఆయన గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్నారు. మరోవైపు.. ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు పరువు నష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్‌పై ఆయన సైతం 2001లో రెండు కేసులు దాఖలు చేశారు.
Also Read : Madhya Pradesh: ఛాన్సలర్ ను ‘కులగురు’గా మారుస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం !