Amaravathi : అమరావతిలో భవనాల నిర్మాణలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు !
అమరావతిలో భవనాల నిర్మాణలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు !
Amaravathi: ఏపీ రాజధాని అమరావతి(Amaravathi) పర్యటనలో భాగంగా స్పీకర్ చింతాకాయల అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాయపూడి సమీపంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ను స్పీకర్ సందర్శించారు. సీఆర్డీఏ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల కోసం తెలుగుదేశం హయాంలో నిర్మించిన 12 టవర్లు 288 ప్లాట్ల వివరాలను స్పీకర్ అడిగి తెలుసుకున్నారు. ఫ్లాట్లలోకి వెళ్లి అనువణువునూ పరిశీలించారు.
Amaravathi Buildings..
అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ… ఢిల్లీలోను హైదరాబాదులో కూడా శాసనసభ్యులకు, ఎంపీలకు ఇలాంటి ఫెసిలిటీ లేదన్నారు. ఎంతో చక్కటి ప్లాన్‌తో విశాలంగా ఈ భవంతులను నిర్మించారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇవి పాడు పడిపోయే పరిస్థితికి వచ్చాయని విమర్శించారు. గతంలో ఉన్న కాంట్రాక్టర్లు ఈ భవనాలను పాత ధరలకు పూర్తి చేయడానికి ముందుకు రావడం లేదన్నారు. పెరిగిన ధరల నేపథ్యంలో ఈ భవనాలను పూర్తి చేయడానికి మరో రూ.300 కోట్లు అదనంగా ఖర్చవుతుంది అని చెబుతున్నారన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అదనంగా రూ.300 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని తెలిపారు. వీలున్నంత త్వరగా ఈ భవనాలను పూర్తి చేసి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కేటాయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. 9 నెలల్లో వీటిని పూర్తి చేయడానికి అధికారులు సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఎమ్మెల్యేలు హోటళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మూడు బెడ్ రూమ్ లతో విశాలమైన వెయిటింగ్ హాలుతో చాలా సౌకర్యవంతంగా ఈ భవనాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
స్పీకర్ హోదాలో నిర్మాణ దశలో ఉన్న ప్రజా ప్రతినిధుల భవన సముదాయాన్ని పరిశీలించానని తెలిపారు. గత ఐదేళ్లలో దురదృష్టం వెంటాడిందని.. నిర్మాణాలు ఒక్క అంగుళం కూడా జరగలేదని అన్నారు. నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ కూడా దొంగలించారని తెలిపారు. ఇపుడు వీటిని పూర్తి చేయడానికి రూ.300 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో ఇటువంటి రాజధాని ఎక్కడా లేదన్నారు. అధికారులు సహకరించి లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. అసెంబ్లీకి 5 ఏళ్ళలో కనీసం వైట్ వాష్ కూడా గత ప్రభుత్వం వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. స్పీకర్‌తో పాటు అమరావతి పర్యటనలో ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, తెనాలి శ్రవణ్ కుమార్, ఆరవ శ్రీధర్‌లు పాల్గొన్నారు.
Also Read : బిహార్ లో బ్రిడ్జ్‌లు కూలడంపై కేంద్రమంత్రి షాకింగ్ కామెంట్స్ !