Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేసిన పోలీసులు !

మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేసిన పోలీసులు !

Kodali Nani: మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కొడాలి నానిపై గుడివాడ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు. తన తల్లి మరణానికి కొడాలి నాని, ఏపీ బెవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కారణమంటూ గుడివాడలోని ఆటోనగర్‌ కు చెందిన దుగ్గిరాల ప్రభాకర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసారు. కొడాలి నాని, ఏపీ బెవరేజెస్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు కృష్ణా జిల్లా గత జేసీ, ప్రస్తుత తూర్పుగోదావరి కలెక్టర్‌ మాధవీలతారెడ్డిపై కేసు నమోదు చేశారు. ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై 448,427,506 ఆర్ అండ్ డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తమ గోదాములో ఉన్న లిక్కర్‌ కేసులను పగులకొట్టి తగులబెట్టారని అందులో పేర్కొన్నారు. తమ బాధ చెబితే వాసుదేవరెడ్డి, మాధవీలత దూషించారని ఆరోపించారు. కొద్దిరోజులకే తన తల్లి మనస్తాపంతో మరణించిందని ప్రభాకర్‌ తెలిపారు.

Kodali Nani Police Case

ఈ సందర్భంగా బాధితుడు దుగ్గిరాల ప్రభాకర్ మాట్లాడుతూ… 2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరుపై తాము ఏపీ బేవరెజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందాము. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే… పద్మా రెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బేవరెజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మాధవిలత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని(Kodali Nani) సహకారంతో ప్రయత్నించారు. కొడాలి నాని అనుచరులు తమపై బెదిరింపులకు దిగారు. తమ గోడౌన్ లో ఉన్న లిక్కర్ కేసులను పగల కొట్టి తగలబెట్టారని.. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. ఇదేం అన్యాయమని తన తల్లి సీతా మహాలక్ష్మి, వాసుదేవ రెడ్డితో ఫోన్లో మాట్లాడగా ఆయన పచ్చి బూతులు తిట్టారన్నారు.

ఈ వ్యవహారంపై జేసీ మాధవిలతా రెడ్డికి ఫిర్యాదు చేసినా… ఆమె కూడా దుర్భషలాడారని ఆయన తెలిపారు. ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే మనస్థాపంతో తన తల్లి మరణించిందన్నారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ అప్పట్లో కొడాలి నాని(Kodali Nani) అనుచరులు కొందరు తనకు ఫోన్లు చేసి బెదిరించారని అన్నారు. తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఫిర్యాదు చేసిన తర్వాత వైసీపీ నేతల పేర్లు ఎందుకు పెట్టావంటూ రాత్రంతా కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారన్నారు. వారి బెదిరింపులతో తనకు ప్రాణ భయం పట్టుకుందన్నారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌లకు లేఖ రాయనున్నట్లు ప్రభాకర్ వెల్లడించారు.

Also Read : Telugu States CMs Meeting: ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం ! 10 అంశాలపై చర్చ !

Leave A Reply

Your Email Id will not be published!