Heavy Rains: ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, నదులు..
ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, నదులు..
Heavy Rains: గత 48గంటలు గా కురుస్తున్న భారీ వర్షాలు ఏపీలోని పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాను భారీ వర్షాలు(Heavy Rains) ముంచెత్తాయి. విశాఖ, జిల్లాలో భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు.
Heavy Rains…
అనకాపల్లి(Anakapalli) జిల్లాలో కల్యాణపులోవ జలాశయం నీటిమట్టం ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరింది. జలాశయం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు తాడిగిరి వంతెన పైనుంచి వరద పొంగుతు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. దీంతో ఇరు వైపులా 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని వినియోగించుకోవాలని సూచించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని విద్యా సంస్థలన్నింటీకి సెలవు ప్రకటించారు.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రామరాజుపాలెం వద్ద వంతెనపై వరద ప్రవహిస్తోంది. దీంతో కేడీపేట-చింతపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాజవొమ్మంగి మండలం ఎర్రంపాడు వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. మరోవైపు వట్టిగెడ్డ జలాశయం పొర్లుకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చింతూరు-కుయుగురు మధ్య వంతెన పై నుంచి వాగు ప్రవహిస్తుండటంతో..ఏపీ, ఒడిశా మధ్య రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద పోటెత్తింది. బ్యారేజ్ నుంచి కాల్వల ద్వారా 3 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వర్షాల కారణంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరి పంట నీటిలోనే నానుతోంది. కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 12 వేల హెక్టార్లకుపైగా వరి నాట్లు నీటమునిగాయి.
రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా ఉంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 7.8 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 3 లక్షల 9 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోని గండి పోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అమ్మవారి ఆలయం గోపురం వరకు వరద నీరు చేరింది. అమ్మవారి ఆలయం వద్ద ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. వరద పెరుగుతున్న నేపథ్యంలో అమ్మవారి దర్శనాలు పూర్తిగా నిలిపివేశారు. ఆ ఆలయం నుంచి పాపికొండల విహారయాత్ర నిలిచిపోయింది.
Also Read : Nara Lokesh: ఖతార్ లో చిక్కుకున్న తెలుగు యువకుడికి నారా లోకేష్ భరోసా !