NEET Paper Leak: పార్లమెంట్‌లో ‘నీట్’ రగడ ! విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు !
పార్లమెంట్‌లో ‘నీట్’ రగడ ! విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు !
NEET Paper Leak: దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన నీట్ పేపర్ లీక్ అంశం పార్లమెంట్ లో మరోసారి రచ్చకు దారి తీసింది. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి కొలువుదీరిన ఎన్డీయే సర్కారు తొలిసారి బడ్జెట్ సమర్పించేందుకు సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా దేశవ్యాప్తంగా దుమారం సృష్టిస్తోన్న నీట్ పేపర్ లీక్(NEET Paper Leak) అంశం చర్చకు వచ్చింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నీట్ అంశంపై మాట్లాడుతుంటే… విపక్షాలు నిరసన వ్యక్తంచేశాయి. ప్రతిపక్ష ఎంపీల నినాదాలతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు… ఈ అంశంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు చేశారు. భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పేపర్ లీక్‌లపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనను తప్ప అందరినీ నిందిస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ‘‘గత ఏడేళ్ల కాలంలో పేపర్ లీక్ జరిగిన దాఖలాలు లేవు. ఎన్టీఏ ఇప్పటివరకు 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ప్రస్తుతం నీట్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది’’ అని వెల్లడించారు. ఈ ప్రభుత్వం పేపర్‌లీక్ ల విషయంలో రికార్డు సృష్టిస్తుందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నంతకాలం విద్యార్థులకు న్యాయం దక్కదన్నారు.
NEET Paper Leak – ఎంపీగా శతృఘ్న సిన్హా ప్రమాణ స్వీకారం !
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని అసన్ సోల్ నుంచి శతృఘ్న సిన్హా ఎంపీగా విజయం సాధించారు. ఆయన జూన్ లో జరిగిన పార్లమెంట్ సమావేశాల సమయంలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. ఇప్పుడు సభ ప్రారంభం కాగానే ఆయన ప్రమాణం చేశారు.
Also Read : Ball Beverage Packaging India: తెలంగాణాలో రూ.700 కోట్లతో అల్యూమినియం టిన్నుల యూనిట్ !