Minister S Jaishankar : బాంగ్లాదేశ్ పరిస్థితులపై రాజ్యసభలో ప్రస్తావించిన విదేశాంగ మంత్రి
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లలో సంస్కరణలు చేపట్టాలంటూ విద్యార్థులు ఇటీవల ఆందోళన బాట పట్టారు...
Minister S Jaishankar : పొరుగనున్న బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జై శంకర్ వెల్లడించారు. ఆ దేశంలో పరిస్థితులు సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢాకాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఆ దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పారు. బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై మంగళవారం రాజ్యసభలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్(Minister S Jaishankar) ఓ ప్రకటన చేశారు. ఆ దేశంలో మొత్తం 19 వేల మంది భారతీయులు ఉన్నారని తెలిపారు. వారితో ప్రభుత్వం టచ్‌లోనే ఉందని వివరించారు. అలాగే ఆ దేశంలోని మైనారిటీల స్థితిగతులను సైతం పర్యవేక్షిస్తున్నామన్నారు.
బంగ్లాదేశ్‌లో విపరీతమైన దోపిడీలతోపాటు అల్లర్లు జరుగుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సరిహద్దు కాపలా దళాలను మరింత అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. అదీకాక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆ దేశ ఆర్మీ చీఫ్ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఎస్ జై శంకర్ గుర్తు చేశారు. మరోవైపు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో దాదాపు 8 వేల మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం విధితమే.
Minister S Jaishankar Comment
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లలో సంస్కరణలు చేపట్టాలంటూ విద్యార్థులు ఇటీవల ఆందోళన బాట పట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఆందోళనలో వందల మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. అయితే ప్రధాని పదవికి రాజీనామా చేయాలని షేక్ హసినాను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె భారత్ చేరుకున్నారు. పొరుగునున్న బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామాలపై మంగళవారం కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం మంత్రి జై శంకర్(Minister S Jaishankar) రాజ్యసభలో పై విధంగా ప్రకటన చేశారు. ఇంకోవైపు బంగ్లాదేశ్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాన్ని రద్దు చేసి.. కొత్తగా మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు చర్యలు ఊపందుకున్నాయి. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారునిగా నోబుల్ అవార్డ్ గ్రహీత ప్రొ.యూనస్ వ్యవహరించనున్నారు.
Also Read : Bangladesh Crisis : బాంగ్లాదేశ్ ప్రధానిని గద్దె దించిన 26 ఏళ్ల యువకుడు