Food Poisoning: అనకాపల్లి జిల్లాలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థుల మృతి !

అనకాపల్లి జిల్లాలో కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థుల మృతి !

Food Poisoning: రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని హాస్టల్‌ లో సమోసా తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో సోమవారం ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన విద్యార్థులను జాషువా, భవాని, శ్రద్ధగా గుర్తించారు. మిగతా 24 మందికి నర్సీపట్నం, అనకాపల్లి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఏడుగురు, అనకాపల్లి(Anakapalli) ఏరియా ఆసుపత్రిలో 17 మంది విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై డీఈవో అప్పారావు విచారణ చేపట్టారు.

Food Poisoning – విద్యార్ధుల మృతిపై సీఎం చంద్రబాబు, లోకేశ్‌ దిగ్భ్రాంతి !

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన ఇతర విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనకు గల కారణాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ ఘటన తనను కలచి వేసిందని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. అనకాపల్లి, అల్లూరిసీతారామరాజు జిల్లా కలెక్టర్లతో మాట్లాడినట్లు వెల్లడించారు. అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది విద్యార్థులకు సరైన వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించానన్నారు.

అనుమతి లేని హాస్టల్స్‌పై కఠిన చర్యలు – అనిత

అనకాపల్లి జిల్లా కోటవురట్ల హాస్టల్‌లో ముగ్గురు మృతి చెందిన ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా దీనిని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హాస్టల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కేవలం కోటవురట్ల హాస్టల్‌ మాత్రమే కాకుండా రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న అన్ని హాస్టల్స్‌పైనా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

సాధారణంగా ప్రభుత్వ అనుమతి ఉన్న హాస్టల్స్‌లో బయటి ఆహారపదార్థాలను అనుమతించబోరని, కానీ.. కోటవురట్ల హాస్టల్‌ లో బయటి నుంచి ఎవరో తెచ్చిన ఆహారం తినడం వల్లే చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నాం వసతి గృహంలో పిల్లలు సమోసా తిన్నారు. వాటితో ఫుడ్‌ పాయిజన్‌ కావడంతో పిల్లలు వాంతులు చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన నిర్వాహకులు… పిల్లలను వారి వారి స్వస్థలాలకు పంపించి వేశారు. వీళ్లలో చింతపల్లి మండలానికి చెందిన ఇద్దరు పిల్లలు.. వాళ్ల ఇళ్ల వద్ద మృతి చెందారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు.

Also Read : TGSRTC Conductor: ఆర్టీసీ బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ !

Leave A Reply

Your Email Id will not be published!