TTD Notices: టీటీడీలో అక్రమాలపై మాజీ చైర్మెన్ కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డికి విజిలెన్స్ నోటీసులు !
టీటీడీలో అక్రమాలపై మాజీ చైర్మెన్ కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డికి విజిలెన్స్ నోటీసులు !
TTD: వైసీపీ ఐదేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ తుది దశకు చేరుకుంది. గత రెండు నెలల్లో అధికారులు టీటీడీలోని వివిధ విభాగాల్లోని లావాదేవీలపై వివరాలు సేకరించారు. నిబంధనలు అతిక్రమించి చేసిన పనులు, ఖర్చులు, ఇతర అంశాలపై ఆయా విభాగాల బాధ్యుల నుంచి వివరణలు తీసుకున్నారు. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నాటి ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి సహా అదనపు ఈవో ధర్మారెడ్డికి నోటీజులు ఇచ్చి వివరణ కోరారు. అప్పటి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డిలకు సైతం తాఖీదులు జారీ చేసి వివరణ కోరినట్లు తెలుస్తోంది. టీటీడీ(TTD)లో సాధారణంగా ఏటా ఇంజినీరింగ్ పనులకు సుమారు రూ. 300 కోట్ల వరకు కేటాయిస్తుంటారు. టెండర్లలో భారీగా ముడుపులు చేతులు మారాయన్న విమర్శలున్నాయి. స్విమ్స్‌కు రూ. 77 కోట్లు, గోవిందరాజస్వామి సత్రాలకు రూ. 420 కోట్లు, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో రహదారులు, ఇతర పనులకు నిధుల కేటాయింపులపై దృష్టి సారించారు. ముఖ్య గణాంక అధికారి బాలాజీకి నోటీసు ఇచ్చి వివరణ కోరారు. ఆర్థిక అవకతవకలను ఎందుకు అడ్డుకోలేదో సమాధానం చెప్పమన్నట్లు తెలుస్తోంది.
TTD – శ్రీవాణి ట్రస్టు నిధుల దుర్వినియోగం పైనా ?
శ్రీవాణి ట్రస్టు నిధుల దుర్వినియోగంపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నిధులను ఆలయ నిర్మాణాలకు ఉపయోగించకుండా ఇతర అవసరాలకు వినియోగించారా ? అనే కోణంలో సమాచారం సేకరించారు. మరోవైపు గోవిందరాజస్వామి సత్రాల కూల్చివేతకు ఆర్అండ్బీ అనుమతి ఎందుకు తీసుకోలేదన్న విషయమై కూడా వివరణ తీసుకున్నారు. నాడు టీటీడీ(TTD)లోని పలు విభాగాల్లో చేపట్టిన నియామకాల పైనా దృష్టి సారించారు. అప్పట్లో బర్డ్ ఆసుపత్రిలో ఇష్టారాజ్యంగా నియామకాలు జరిగాయి. కొద్దిరోజుల పాటు ధర్మారెడ్డి బర్డ్ ఆసుపత్రికి డైరెక్టరుగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. అర్హత లేని వ్యక్తిని ఎలా నియమిస్తారన్న విషయమై కూడా అధికారులు వివరణ ఇవ్వాలని అడిగారు. మొత్తంగా తితిదేలో అన్ని విభాగాల్లోని అధికారుల నుంచి వివరణ సేకరించి తుది నివేదికను ప్రభుత్వానికి పంపేందుకు విజిలెన్స్ అధికారులు సిద్ధమవుతున్నారు.
Also Read : Telangana State Waqf Board: వక్ఫ్ చట్టం సవరణ బిల్లును తిరస్కరించిన తెలంగాణా వక్ఫ్ బోర్డు !