West Bengal Bundh: హింసాత్మకంగా మారిన బెంగాల్ బంద్ !
హింసాత్మకంగా మారిన బెంగాల్ బంద్ !
West Bengal: జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన ను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన సచివాలయ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడంపై తీవ్రంగా మండిపడ్డ బీజేపీ బుధవారం 12 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. అయితే, ఈ బంద్ కొన్ని చోట్ల హింసాత్మకంగా మారింది. పలు చోట్లు బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి.
West Bengal Bandh..
ఉత్తర 24 పరగణాల జిల్లాలో బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన త్రుటిలో తప్పించుకుని క్షేమంగా బయటపడ్డారు. మరో నేత ఇంటికి వెళ్తుండగా తన వాహనాన్ని 50-60 మంది అడ్డగించారని పాండే ఆరోపించారు. అనంతరం బాంబులు విసిరి… కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. ఇదంతా తృణమూల్ కాంగ్రెస్, పోలీసుల కుట్రేనని ఆరోపించారు. ఈ ఘటనలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను భాజపా ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసి మమతా బెనర్జీ(Mamata Banjerjee) ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. కాగా.. ఈ ఆరోపణలను టీఎంసీ ఖండించింది.
ఇదిలా ఉండగా.. దీదీ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ పిలుపునిచ్చిన బంద్ ప్రభావం రవాణా వ్యవస్థపై పడింది. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక రాష్ట్ర రవాణా వ్యవస్థకు చెందిన బస్సులు సైతం డిపోలకే పరిమితమయ్యాయి.నిరసనలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన పలువురు బీజేపీ కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ ఆందోళనలను ఎక్కడి కక్కడ నిలువరించేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేశారు.
Also Read : President Murmu : కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై తొలిసారి స్పందించిన రాష్ట్రపతి