Vinesh Phogat: రైతుల ధర్నాకు రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంఘీభావం !
రైతుల ధర్నాకు రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంఘీభావం !
Vinesh Phogat: శంభూ సరిహద్దుల వద్ద రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మద్దతు తెలిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని కోరారు. మీ బిడ్డగా రైతులందరికీ అండగా ఉంటానని, తాను రైతు కుటుంబంలో జన్మించినందుకు గర్వపడుతున్నట్లు వినేశ్ ఫొగట్(Vinesh Phogat) తెలిపారు. శనివారం రైతుల నిరసనల్లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పాల్గొన్నారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఢిల్లీ శివారులోని శంభు సరిహద్దులో రైతులు చేపట్టిన నిరసన నేటికి 200ల రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా వినేశ్ రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొని తన సంఘీభావాన్ని తెలియజేశారు. రైతు ఉద్యమ మద్దతుదారులు ఆమెను పూలమాలలతో సత్కరించారు. అనంతరం ఆమె రైతులు చేపట్టిన నిరసనను ఉద్దేశించి మాట్లడారు.
Vinesh Phogat Support
‘‘నేను ఓ రైతు కుటుంబంలో జన్మించినందుకు చాలా అదృష్టవంతురాలిని. మీ బిడ్డగా నేను రైతులకు చివరిదాకా అండగా ఉంటాను.మన హక్కులను పట్టించుకోవడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. అందుకే మన హక్కులు కోసం పోరాడుదాం. మీరంతా మీ హక్కుల విషయంలో హామీ పొందిన తర్వాతే ఇళ్ల చేరాలని దేవుడుని కోరుకుంటాన్నా. ప్రభుత్వం రైతుల డిమాండ్లను నెరవేర్చాలి. రైతులు చాలా కాలంగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఆందోళనకరం.200 రోజుల నుంచి రైతులు నిరసనలు తెలుపుతున్నారు. రైతులు కొనసాగిస్తున్న నిరసనలు హక్కలు సాధించుకోవాలనే వారికి చాలా స్ఫూర్తిదాయకం. నా ప్రధాన లక్ష్యం హక్కుల కోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిలవటం’ అని అన్నారు.
పంటలకు మద్దతు ధర డిమాండ్ చేస్తూ రైతుల చేపట్టిన ఢిల్లీ మార్చ్ ను పోలీసులు, అధికారులు శంభు సరిహద్దులో అడ్డుకోవటంతో ఫిబ్రవరి 13 నుంచి రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి మద్దతు ధర కల్పిస్తామనే చట్టపరమైన గ్యారంటీని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు… ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్(Vinesh Phogat) నిర్ణీత 50 కిలోలకుగాను 100 గ్రాములు అదనంగా బరువు ఉండటంతో పతకం చేజారిన విషయం తెలిసిందే. ఈ సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు.
ఈ సందర్భంగా కొన్నాళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని జరుగుతున్న ప్రచారంపై తాజాగా ఒలింపియన్ వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) స్పందించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి ఆమెను ఉద్దేశించి ‘‘మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా..?’’ అని ప్రశ్నించారు. దీనికి వినేశ్ స్పందిస్తూ ‘‘ఈ అంశంపై మాట్లాడదల్చుకోలేదు. నా రైతు కుటుంబాన్ని కలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. మీరు దృష్టిని నా వైపు తిప్పితే… వారి పోరాటం, కష్టాలు వృథా అవుతాయి. ఇక్కడ నాపై ఫోకస్ ఉండకూడదు. రైతులపై మాత్రమే ఉండాలి. నేనొక క్రీడాకారిణిని, భారతీయురాలిని. ఎన్నికలపై నాకు ఎలాంటి ఆందోళన లేదు. రైతుల సంక్షేమంపై మాత్రమే నా దృష్టి ఉంది’’ అని సమాధానం చెప్పారు.
Also Read : Red Alert : తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ