Haryana Elections: హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలో మార్పు !

హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలో మార్పు !

Haryana Elections: హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీని అక్టోబర్‌ 5కు మారుస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్‌ 1న పోలింగ్‌ నిర్వహించాల్సి ఉండగా.. అక్టోబర్‌ 5కు మార్చింది. అక్టోబర్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టాలని తొలుత నిర్ణయించగా.. జమ్మూకశ్మీర్‌ తో పాటే అక్టోబర్‌ 8న ఫలితాలు వెల్లడించనున్నారు.

Haryana Elections Update

బిష్ణోయ్‌ కమ్యూనిటీ నుంచి వచ్చిన వినతి మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. తమ మూలపురుషుడు గురు జంబేశ్వర్‌ స్మారకంగా అసోజ్‌ అమవాస్య పండగను వీరు నిర్వహిస్తారు. అక్టోబర్‌ 2న జరిగే ఈ వేడుకలో హరియాణా(Haryana)తో పాటు, పంజాబ్‌, రాజస్థాన్‌కు చెందిన ఈ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ క్రమంలో తమ ఓటు హక్కును కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్యంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్న ఉద్దేశంతో పోలింగ్‌ తేదీలను మార్చినట్లు ఈసీ ఓ ప్రకటన జారీ చేసింది.

హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా నేతృత్వంలోని జననాయక జనతా పార్టీ (జేజేపీ)తో పొత్తు పెట్టుకుని గద్దెనెక్కింది. ప్రస్తుత ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది. అయితే తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌… పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీను ఓడించి ఈసారి ఎలాగైనా గద్దెనెక్కాలని గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూకశ్మీర్‌ లో సీట్లు 90కి పెరిగాయి. సెప్టెంబరు 18, 25, అక్టోబరు 1న మూడు దశల్లో పోలింగ్‌ జరగనుంది.

Also Read : Vinesh Phogat: రైతుల ధర్నాకు రెజ్లర్ వినేశ్‌ ఫొగట్‌ సంఘీభావం !

Leave A Reply

Your Email Id will not be published!