Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్లు, హెలికాప్టర్లు డ్రోన్లతో ఆహారం సరఫరాకు ప్రయత్నాలు !
వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్లు, హెలికాప్టర్లు డ్రోన్లతో ఆహారం సరఫరాకు ప్రయత్నాలు !
Vijayawada: వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి వీటి ద్వారా ఆహారం, ఔషధాలు, తాగునీరు వంటివి అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Vijayawada Flooded..
వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి వీటి ద్వారా ఆహారం, ఔషధాలు, తాగునీరు వంటివి అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బోట్లు, హెలికాప్టర్లు సైతం వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహార సరఫరాకు ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా ఈ డ్రోన్ల వినియోగంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు డ్రోన్లతో విజయవాడ(Vijayawada) కలెక్టరేట్ వేదికగా ట్రయల్ రన్ నిర్వహించింది. ఓ మినీ హెలికాప్టర్‌లా ఉండే ఈ డ్రోన్లు ఎంత బరువును మోయగలవు? ఏయే ప్రదేశాల వరకు వెళ్లగలవు? మార్గంలో ఎక్కడైనా చెట్లు, స్తంభాలు వంటివి వస్తే ఎలా తప్పించుకొని వెళ్లి రాగలవు? తదితర అంశాలను పరిశీలించారు.
సీఎం చంద్రబాబు స్వయంగా ఈ ట్రయల్ రన్‌ను పర్యవేక్షించారు. ఈ ట్రయల్ రన్ తర్వాత దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు ఆహారం, మెడిసిన్, తాగునీరు వంటివి తీసుకెళ్లొచ్చని అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వీటిని ఏ మేరకు వినియోగించుకోవచ్చో చూసుకొని వీలైనన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం ట్రయల్ రన్‌కు మూడు ఫుడ్‌డెలివరీ డ్రోన్లను వినియోగించగా.. మరో ఐదు డ్రోన్లు సిద్ధంగా ఉంచారు.
వరద సహాయ చర్యల కోసం ఇప్పటికే రంగంలోకి దిగిన నేవీ హెలికాప్టర్లు బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నాయి. ఇప్పటివరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేశారు. నిరాశ్రయుల కోసం విజయవాడ(Vijayawada) నగరంలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17 చోట్ల తెగిపోయిన రోడ్లు, పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వరద బాధితులకు ఆహారం, మంచినీరు పంపిణీ కార్యక్రమాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు సీఎం సూచనలు ఇస్తున్నారు.
Also Read : Landslide: వైష్ణో దేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి.. ఒకరు మృతి