Chandrababu Naidu: అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలూ చేపట్టామని ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) తెలిపారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు. నగరంలో డివిజన్‌కు ఒక సీనియర్ ఐఏఎస్‌ను నియమించామని చెప్పారు. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారన్నారు. పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని.. బాధితులకు మూడు పూటలా అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్టచివరి బాధితుడికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు.
Chandrababu Naidu – బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా..
వరదలతో పేదల బాధలు వర్ణణాతీతం. కొన్ని ఇళ్లల్లోకి పాములు, తేళ్లు వచ్చాయి. దీంతో వారందరికీ బాధ, భయం ఉంటుంది. అధికారులంతా మానవతా దృక్పథంతో పనిచేయాలి. అందుతున్న సహాయంపై ఐవీఆర్‌ఎస్ నిర్వహిస్తున్నాం. కొన్ని ప్రాంతాలకు ఇంకా ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆహారం అందని బాధితుల నంబర్లు అధికారులకు పంపిస్తున్నాం. ఇబ్బందులపై ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి. నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నా. అధికారులకు రెండు రోజులుగా చెప్పాం.. ఇప్పుడు సరిగా పనిచేయలేదని ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవు. మీనమేషాలు లెక్కించడం సరికాదు.. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులూ ఒడ్డి సేవ చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలి. ఏవిధంగా సహకారం అందించగలిగితే అలా చేయూత అందించాలి. ఆర్థికంగా, నిత్యావసరాలు, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం.. ఇలా ఏది వీలైతే అది మీ శక్తిమేర చేయాలి. ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తాం.
సితార సెంటర్‌కు సీఎం చంద్రబాబు ..
విజయవాడ పర్యటనలో భాగంగా సితార సెంటర్‌కు సీఎం చంద్రబాబు(Chandrababu) చేరుకున్నారు. జేసీబీ ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితి పరిశీలించారు. ఆహారం అందుతుందా..? లేదా..? అని బాధితులను అడిగి తెలుసుకుంటున్నారు. స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా అధికారులపై చర్యలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు.
Also Read : Telangana Employees : తెలంగాణ వరద బాధితుల కోసం 100 కోట్ల విరాళం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు