YS Sharmila: J² (జిందాల్ – జగన్) స్కీములేసుకొని కాదంబరి కథ నడిపించారు – వైఎస్ షర్మిల
J² (జిందాల్ - జగన్) స్కీములేసుకొని కాదంబరి కథ నడిపించారు - వైఎస్ షర్మిల
YS Sharmila: ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల… మాజీ ముఖ్యమంత్రి, తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకు పడ్డారు. సినీనటి కాదంబరి జెత్వానీని కట్టడి చేసేందుకు ఐపీఎస్ అధికారులను రంగంలోకి దించడం దారుణమని ఆమె మండిపడ్డారు. మంగళవారం కడప కలెక్టరేట్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్ లో జగన్ ను సజ్జన్ జిందాల్ పదేపదే కలుసుకోవడం చూసి స్టీల్ ఫ్యాక్టరీ పనులు వేగవంతం చేస్తున్నారని అనుకున్నామని, కానీ కేవలం కాదంబరి అనే మహిళను కట్టడి చేసేందుకు స్కీమ్‌లు వేశారని తెలుసుకోలేకపోయామని పేర్కొన్నారు. ఇది మామూలు మాస్టర్ ప్లాన్ కాదన్నారు. ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి తొక్కాలని చూశారని, జే అండ్ జే ఇద్దరూ బుర్రలు పెట్టారని, జే స్క్వేర్‌లు కలసి కార్యాచరణ రూపొందించారని ఆరోపించారు. మీ బుర్రలు జెత్వానీపై కాకుండా స్టీల్‌ప్లాంట్‌పై పెట్టి ఉంటే అది ఏనాడో కార్యరూపం దాల్చేదని తెలిపారు.
YS Sharmila Comment
జిందాల్ కోసం జగన్ ఇంత దిగజారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, తనకు కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారనే విషయాన్ని ఆయన మరిచారా అని షర్మిల(YS Sharmila) ప్రశ్నించారు. కాదంబరి జెత్వానీకు అండగా ఉండి పోరాడటానికి తాను సిద్ధమని ప్రకటించారు. కాగా, కడప స్టీల్ ప్లాంట్‌ను టెంకాయలు కొట్టే ఫ్యాక్టరీగా మార్చారని షర్మిల(YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం… వైఎస్సార్ తలపెట్టిన ఫ్యాక్టరీగా భావించి మోకాలడ్డిందని ఆరోపించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల పాలన తర్వాత చివరి ఆరు నెలల ముందు కడప స్టీల్ ఫ్యాక్టరీకి చంద్రబాబు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారన్నారు.
అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ ఎన్నికలకు 6నెలల ముందు టెంకాయ కొడితే ఒట్టి బూటకమని, అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అని పెద్దపెద్ద మాటలు మాట్లాడారని, ఇదే ఫ్యాక్టరీకి జగన్ మూడోసారి శంకుస్థాపన చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్నికలకు ఏడాది ముందు నాలుగోసారి 2023లో కూడా శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. జగన్ నాలుగోసారి వేసిన శిలాఫలకం దిష్టిబొమ్మలా ఉందని, దీనిని టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా మార్చారని షర్మిల ఎద్దేవా చేశారు. అంతకుముందు ఆమె కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
Also Read : MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి కూతురు నేహారెడ్డికి జీవీఎంసీ షాక్ !