Vijayawada Floods : బుడమేరులో కొనసాగుతున్న వరద ఉద్రిక్తత
ముంపు బాధిత ప్రజలతో మాట్లాడుతూ అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందంటూ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు...
Vijayawada Floods : బుడమేరులో వరద ఉధృతి కొనసాగుతోంది. ఉదయం నుంచి రెండు మేర పెరిగిన నీటి ప్రవాహం మధ్యాహ్నానికి మరో రెండు అడుగులు పెరిగింది. దీంతో దాదాపు ఆరు కిలోమీటర్ల మేర రోడ్లు మునిగిపోయాయి. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటితో నందివాడ మండలంలోని 12 గ్రామాలు జలదిగ్బంధంలో మునిగిపోయాయి. ముంపు గ్రామాల్లో సహాయ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఆహార ప్యాకెట్ల పంపిణీ చేశారు. స్వయంగా ట్రాక్టర్ తోలుతూ ముంపు గ్రామాలలో ఎమ్మెల్యే రాము పర్యటిస్తున్నారు.
Vijayawada Floods Update
ముంపు బాధిత ప్రజలతో మాట్లాడుతూ అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందంటూ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ… అనుకోని విధంగా ఎగువ నుండి భారీగా వరద రావడంతో ప్రజలు, రైతులు భారీగా నష్టపోయారన్నారు. మండలంలో నష్ట అంచనాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కుటుంబ శుభకార్యం నిమిత్తం అమెరికా వెళ్లానని…. రాష్ట్రంలో పెట్టుబడుల నిమిత్తం అక్కడ పారిశ్రామికవేత్తల సమావేశాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. అయితే నందివాడలో ముంపు విషయం తెలిసిన వెంటనే అమెరికా పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని గుడివాడ వచ్చానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు.
కాగా.. బుడమేరు వరద కాస్త తగ్గుముఖం పట్టడంతో నిన్న (గురువారం) ప్రజలు తమ నివాసాల్లోకి వెళ్లి బురదను శుభ్రం చేస్తున్నారు. అయితే ఈరోజు మళ్లీ వరద నీరు ఇంట్లోకి రావడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రానికి తగ్గుముఖం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎడతెరపిలేని వర్షాలు బెజవాడ వాసులను భయబ్రాంతులకు గురి చేశాయి. వర్షాలతో ప్రజలు ఇళ్లకే పరిమతమయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే వారం రోజుల అనంతరం విజయవాడ(Vijayawada) వాసులకు సూర్య భగవానుడు ఈరోజు దర్శనమిచ్చారు. గడిచిన వారం రోజులుగా వర్షాలు, ముసురు పట్టిన కారణంగా సూర్య భగవానుడు కనపడని పరిస్థితి. అయితే ఈరోజు ఉదయమే సూర్యుడు కనిపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
Also Read : MP Purandeswari : వైసీపీ వాళ్ళ అసమర్థత వల్లనే బుడమేరు గండి కొట్టింది