కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రస్తుతం సీఎం కుర్చీ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఓ వైపు సీఎంగా ఉన్న సిద్దరామయ్య మరో వైపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎవరు ఉండాలనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని ఇప్పటికే ఏఐసీసీ చీఫ్ ఖర్గే స్పష్టం చేశారు. సోనియా , రాహుల్ గాంధీ, తాను కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయినా ఎక్కడా తగ్గడం లేదు సీఎం, డిప్యూటీ సీఎం. ఈ తరుణంలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆయన బాంబు పేల్చారు అధికారంలో చోటు చేసుకున్న ఆధిపత్య పోరు గురించి. ఏకంగా ఆర్. అశోక సీఎం సిద్దరామయ్య ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, ఆయన మద్దతుదారుల ఫోన్లు ట్యాప్ చేసి సమాచారం వింటునట్లు మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా గూఢచార శాఖ ద్వారా సమాచారం సేకరిస్తుందని, ఇందులో కొత్తేముందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి పరమేశ్వరన్.
సిద్దరామయ్య ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేక అధికారినే నియమించాడని, అనధికార ప్రత్యేక దర్యాప్తు చట్టం(సిట్)ను ఏర్పాటు చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు విపక్ష నేత ఆర్.అశోక్. సీఎం కుర్చీ రక్షణ కోసం సొంత ఎమ్మెల్యేల కదలికలపై సిద్దరామయ్య నిఘా వేసినట్లు ఆరోపించారు కేంద్రమంత్రి కుమారస్వామి. ఇదిలా ఉండగా పాలు, తేనెల్లాంటి డీకే శివ కుమార్కు, నాకు మధ్య ఉన్న బంధాన్ని విడగొట్టడానికి విమర్శలు చేస్తున్నారంటూ జవాబిచ్చారు సీఎం సిద్దరామయ్య. అయితే నాకు ఎమ్మెల్యేలు, ఢిల్లీ పెద్దలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదని, సీఎం కుర్చీ ఖాళీ అయిన తర్వాతే తన ప్రయత్నాలు మొదలవుతాయని తెలిపారు డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్.
