రేపే గడ్కరీ చేతుల మీదుగా బ్రేక్ త్రూ టన్నెల్ ప్రారంభం
వరల్డ్ లో అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న టన్నెల్ ఇదే
హైదరాబాద్ : జమ్మూ అండ్ కాశ్మీర్ , లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలను నిత్యం అనుసంధానించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఈ టన్నెల్ తుది బ్రేక్ త్రూ మంగళవారం జరగనుంది. కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ జోజిలా టన్నెల్ తుది బ్రేక్ త్రూ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 13.153 కిలోమీటర్ల పొడవైన జోజిలా టన్నెల్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న అత్యంత పొడవైన సింగిల్-ట్యూబ్ ద్విముఖ రహదారి సొరంగంగా గుర్తింపు పొందింది. ఈ టన్నెల్ తుది బ్రేక్‌త్రూ భారత మౌలిక సదుపాయాల చరిత్రలో ఒక విశిష్ట ఘట్టంగా నిలవనుంది.
సోనమార్గ్ సమీపంలోని బాల్తాల్ పశ్చిమ పోర్టల్ నుంచి ద్రాస్-కార్గిల్ ప్రాంతంలోని మీనమార్గ్ తూర్పు పోర్టల్ వరకు విస్తరించిన జోజిలా టన్నెల్ ప్రాజెక్టు, భారీ మంచు, హిమపాతాలు, తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా సంవత్సరంలో సగం కాలం మూసి ఉంచే జోజిలా పాస్‌కు శాశ్వత పరిష్కారం చూపుతుంది. సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ టన్నెల్, భారతదేశ పర్వత ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అత్యంత కీలకమైన ఇంజినీరింగ్ విజయాల్లో ఒకటిగా నిలుస్తోంది.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) నిర్మిస్తోంది. జోజిలా టన్నెల్‌ను న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (ఎన్ ఏ టి ఎం) ఉపయోగించి ఎం ఈ ఐ ఎల్ నిర్మిస్తోంది. హిమాలయ ప్రాంతంలోని సున్నితమైన భౌగోళిక పరిస్థితులు, మారుతూ ఉండే రాతి నిర్మాణాలకు అనుగుణంగా ఈ పద్ధతి అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది. దశలవారీ తవ్వకం, తక్షణ భద్రతా చర్యలు, షాట్‌క్రీట్, రాక్ బోల్టింగ్, నిరంతర భూభౌతిక పర్యవేక్షణ వంటి చర్యల ద్వారా సొరంగ నిర్మాణంలో స్థిరత్వం, భద్రత, వేగాన్ని మేఘా విజయవంతంగా కొనసాగించింది.
ప్రధాన టన్నెల్‌తో పాటు అనుసంధాన రహదారులు, వంతెనలు, రక్షణ నిర్మాణాలు, కట్-అండ్-కవర్ సెక్షన్లు, మంచు రక్షణ గ్యాలరీలు, నిల్‌గ్రార్ జంట సొరంగాలు కూడా ఈ ప్రాజెక్టులో భాగమే.
