తొమ్మిది జాతీయ అవార్డులతో టాలీవుడ్ టాప్

క‌మిటీ కుర్రోళ్లు, క‌ల్కి 2898 ఏడి, పుష్ప -2 రూల్

హైద‌రాబాద్ : కేంద్ర ప్ర‌భుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డులలో టాలీవుడ్ తొమ్మిది అవార్డులను గెలుచుకుని అత్యధిక విజేతలలో ఒకటిగా నిలిచింది. ఈ అవార్డులు భారీ వినోదాత్మక చిత్రాలు, కథాబలం ఉన్న చిత్రాలు, సాంకేతిక విభాగాలకు దక్కాయి. యదు వంశీ దర్శకత్వం వహించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రానికి గాను పి. రవి కుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ రెండు అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోదాత్మక చిత్రం , నితిన్ జిహాని చౌదరికి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు ల‌భించింది. ’35 చిన్న కథ కాదు’ చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా నిలవడమే కాకుండా, అరుణ్ దేవ్ పోతుల ఉత్తమ బాల నటుడిగా గుర్తింపు పొందారు.

ఇక ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి సుకుమార్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డును, దీపాలీ నూర్ , శీతల్ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డును గెలుచుకున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి చిత్రం ‘లక్కీ భాస్కర్’ ఉత్తమ సంభాషణల రచయిత అవార్డును దక్కించుకుని, తెలుగు సినిమాకు అద్భుతమైన విజయాలను అందించింది. ‘కమిటీ కుర్రోళ్ళు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైనందుకు దర్శకుడు యదు వంశీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ గుర్తింపు మా ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని, మన మూలాలకు దగ్గరగా ఉండే కథలను చెప్పేలా మమ్మల్ని ప్రేరేపించిందని పేర్కొన్నారు. నిర్మాత నిహారిక కొణిదెలకు కృతజ్ఞతలు తెలిపాడు. కథను నమ్మినందుకు నిహారిక కు రుణ‌ప‌డి ఉంటామ‌న్నాడు.

Leave A Reply

Your Email Id will not be published!