తమిళనాడు : టీ సాగుకు కేరాఫ్ గా మారిన తమిళనాడులోని నీలగిరి లో ఇప్పుడు టీ సాగు విస్తీర్ణం తగ్గింది. ఏకంగా 60 శాతం ఉత్పత్తి తగ్గడం కొంత ఆందోళన కలిగిస్తోంది. వర్షాభావం కారణంగా సాధారణంగా ఎకరాకు నెలకు 500 కిలోల పచ్చ టీ ఆకులు లభించే చోట ప్రస్తుతం దిగుబడి 200 కిలోలకు పడి పోయింది. ఇది 60 శాతం తగ్గుదలను సూచిస్తుంది. నీలగిరి చరిత్రలో మొదటిసారిగా ‘ఎల్ నినో’ కారణంగా ఏర్పడిన తీవ్రమైన వడగాల్పులు, కరువు పరిస్థితులు టీ ఫ్యాక్టరీలకు పచ్చ టీ ఆకుల సరఫరాను భారీగా తగ్గించాయి. దీనివల్ల టీ పొడి ఉత్పత్తిపై టీ రైతులు, కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. పర్వతాల రాణిగా ప్రసిద్ధి చెందిన నీలగిరి జిల్లా ఆర్థిక వ్యవస్థకు టీ సాగు ప్రధాన ఆధారాలలో ఒకటి. జిల్లావ్యాప్తంగా అనేక హెక్టార్లలో 65,000 మందికి పైగా చిన్న , సన్నకారు రైతులు టీ సాగులో నిమగ్నమై ఉన్నారు. పచ్చ టీ ఆకులకు న్యాయమైన , సరైన ధరను నిర్ణయించాలని కోరుతూ టీ రైతులు గత కొన్నేళ్లుగా నిరసనలు తెలుపుతున్నారు.
తగిన ధరలు లేక చిన్న , సన్నకారు టీ రైతులు ఇప్పటికే ఇబ్బందులు పడుతుండగా ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు విఫలం కావడంతో ఈ ఏడాది పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. నీలగిరిలో ఇప్పుడు రెండవ సీజన్ ప్రారంభమైంది. సాధారణంగా ఈ సమయంలో టీ మొక్కల చిగుళ్లు బాగా పెరిగి పచ్చదనంతో కళకళ లాడుతుంటాయి. అయితే, సుదీర్ఘకాలం కొనసాగిన పొడి వాతావరణం కారణంగా లేత టీ చిగుళ్లు వాడి పోయాయి. ఊటీ, కూనూర్, కోటగిరి , మంజూర్ వంటి ప్రాంతాల్లోని టీ ఫ్యాక్టరీలకు పచ్చ టీ ఆకుల సరఫరా గణనీయంగా తగ్గింది. దీనివల్ల జిల్లాలో టీ పొడి ఉత్పత్తి భారీగా పడిపోయింది. గతంలో రోజుకు సుమారు 4,000 కిలోల పచ్చ టీ ఆకులను స్వీకరించిన టీ ఫ్యాక్టరీలు ఇప్పుడు కేవలం 600 కిలోలను మాత్రమే పొందుతున్నాయి.
