హైదరాబాద్ : ఎవరీ అనిల్ చక్రవర్తి అనుకుంటున్నారా. ఐటీ సెక్టార్ లో తను ఇప్పుడు ఓ సంచలనంగా మారారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత జనాదరణ పొందిన సంస్థ అడోబ్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ బిగ్ కంపెనీకి శంతను నారాయణ్ ప్రెసిడెంట్ , సీఈఓగా ఉన్నారు. ఇక తాజాగా అడోబ్ సంచలన ప్రకటన చేసింది. తదుపరి సంస్థకు సీఈఓగా అనిల్ చక్రవర్తి కొలువు తీరనున్నాడని వెల్లడించింది. తనను బోర్డు ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. దశాబ్దాలుగా అడోబ్ వ్యాపార నమూనాను మార్చడంలో శాంతను చూపిన అసాధారణ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అడోబ్ వృద్ధిలో తదుపరి అధ్యాయాన్ని సాధించడానికి తాము సరైన స్థితిలో ఉన్నామన్నాడు. నాపై నమ్మకం ఉంచినందుకు బోర్డుకు కృతజ్ఞతలు తెలిపాడు అనిల్ చక్రవర్తి.
మా వినియోగదారులకు సేవలను కొనసాగించడానికి , ఏఐ శకంలో అడోబ్‌ను మార్చడానికి మా ఉద్యోగులు, శాంతను, డైరెక్టర్ల బోర్డుతో కలిసి పని చేయడానికి నేను ఎదురు చూస్తున్నానని అన్నారు. ఇదిలా ఉండగా అనిల్ చక్రవర్తి జనవరి 2020లో డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ వ్యాపారానికి నాయకత్వం వహించాడు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా, జనరల్ మేనేజర్‌గా అడోబ్‌లో చేరారు. సెప్టెంబర్ లో సృజనాత్మకత , ఉత్పాదకతతో సహా అడోబ్ పూర్తి ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోతో ఎంటర్‌ప్రైజ్ వినియోగదారులకు సేవలు అందించే అడోబ్ ప్రపంచ వ్యాప్త ఫీల్డ్ కార్యకలాపాలకు నాయకత్వం వహించే అదనపు బాధ్యతను స్వీకరించారు. డిసెంబర్ 2021లో ఆయన డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ ,ప్రపంచవ్యాప్త ఫీల్డ్ ఆపరేషన్స్ విభాగానికి అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు.
చక్రవర్తి నాయకత్వంలో కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆర్కెస్ట్రేషన్ సొల్యూషన్స్‌లో అడోబ్ ఒక పరిశ్రమ అగ్రగామిగా నిలిచింది. అడోబ్ సీఎక్స్ ఎంటర్‌ప్రైజ్, జెన్ స్టూడియో , బ్రాండ్ విజిబిలిటీ వంటి మార్కెట్-లీడింగ్ ఉత్పత్తుల అభివృద్ధికి నాయకత్వం వహించారు. ఇవి ఏఐ శక్తిని ఉపయోగించి అద్భుతమైన కస్టమర్ అనుభవాలను అందించే, ఆయా విభాగాలకే నిర్వచనం ఇచ్చే ఉత్పత్తులు. అడోబ్ ఎక్స్‌పీరియన్స్ ప్లాట్‌ఫామ్‌ను విస్తరించడంలో మరియు సీఎక్స్ ఎంటర్‌ప్రైజ్ కోవర్కర్ వంటి కొత్త ఉత్పత్తి ఆవిష్కరణలను ప్రవేశ పెట్టడంలో కీలక పాత్ర పోషించారు.
తన ప్రస్తుత పదవికి ముందు చక్రవర్తి ఎంటర్‌ప్రైజ్ క్లౌడ్ డేటా మేనేజ్‌మెంట్‌లో ప్రపంచ అగ్రగామి అయిన ఇన్ఫర్మాటికాలో నాలుగు సంవత్సరాల పాటు సీఈఓగా పనిచేశారు. మొదట 2013లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఇన్ఫర్మాటికాలో చేరారు. ఇన్ఫర్మాటికాలో చేరడానికి ముందు చక్రవర్తి సిమాంటెక్, వెరిసైన్ , మెకిన్సీ కంపెనీలలో ఎగ్జిక్యూటివ్ పదవుల ద్వారా టెక్నాలజీ పరిశ్రమలో విస్తృత అనుభవాన్ని పొందారు. చక్రవర్తి భారతదేశంలోని వారణాసి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్స్ ఆఫ్ సైన్స్ , పిహెచ్.డి పట్టాలను పొందారు.
