పట్టుదల ఉంటే విజయం తథ్యం : పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

నిరుద్యోగ అభ్యర్థులకు మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పిస్తాం

ఖ‌మ్మం జిల్లా : పట్టుదలతో ప్రయత్నిస్తే, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే నేటి నిరుద్యోగ యువతీ, యువకులు భవిష్యత్తులో ఉద్యోగులుగా, అధికారులుగా స్థిరపడొచ్చని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పొంగులేటి స్వరాజ్యం – రాఘవరెడ్డి ( పీఎస్ఆర్) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైట్ ఛాయిస్ నిర్వహణలో ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్డు లో గల రామకృష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఫ్రీ కోచింగ్ క్యాంప్ ను ప్రారంభించారు. గతంలో 2016లో 2,300 మందికి ఇలానే శిక్షణ ఇప్పించగా.. 350 మందికి పైగా ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని, ఆరోజు వారి తల్లిదండ్రుల కళ్లలో చూసిన ఆనంద భాష్పాలు తానెప్పటికీ మరువలేనని అన్నారు.

మధ్యతరగతి యువతీ యువకుల ఉన్నత భవిష్యత్తు కోసం తన వంతుగా సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ప్ర‌క‌టించారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఉత్తమ ఫ్యాకల్టీతో, రీజనింగ్ పుస్తకాలతో ఏర్పాటు చేసిన ఈ ఫ్రీ కోచింగ్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగ అభ్యర్థులెవరికీ ఇబ్బంది కలగకుండా మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రైట్ చాయిస్ నిర్వాహకులు మెండెం కిరణ్ కుమార్ కృషి, తనతో ఉన్న అనుబంధం మరువ లేనిదని మంత్రి పొంగులేటి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కోచింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వి. సీతారాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొర్రా రాజశేఖర్, అడిషనల్ డీసీపీ రామానుజం, ఐఏఎస్ ట్రైనర్ ఆకెళ్ళ రాఘవేంద్రరావు, రీజనింగ్ ఫ్యాకల్టీ రమణ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!