పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది

ఏపీ గ్రీన్ చైర్మ‌న్ నాగ‌బాబు కొణిద‌ల కామెంట్స్

అమ‌రావ‌తి : పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది అని పేర్కొన్నారు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మ‌న్ నాగ‌బాబు కొణిద‌ల . పర్యావరణ పరిరక్షణకు 20 ఏళ్ల ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. సూర్యలంక బీచ్ లో విద్యార్థులతో కలిసి తాటి మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడారు నాగ‌బాబు. వాతావరణ సమతుల్యతను పరిరక్షించడంతో పాటు జీవ వైవిధ్యం, జీవరాశుల మనుగడను కాపాడు కోవడానికి విస్తృత స్థాయిలో పచ్చదనాన్ని పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. మొక్కలు నాటడం కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, భావి తరాల భవిష్యత్తును కాపాడే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ అనేది ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో పూర్తయ్యే కార్యక్రమం కాదని, రాబోయే తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో, నిరంతర కృషితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

నాగ‌బాబు బాపట్ల జిల్లా సూర్యలంకలో పర్యటించారు. సముద్రపు కోతను అరికట్టడానికి విద్యార్థులతో కలిసి తాటి చెట్లను నాటారు. గ్రేట్ గ్రీన్ వాల్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణం గురించి పుస్తకాల్లో చదవడం, కాగితాలపై అవగాహన పొందడం కంటే పిల్లలు, పెద్దలు స్వయంగా మొక్కలు నాటి, వాటి సంరక్షణలో భాగస్వాములు కావడం ద్వారా ప్రకృతితో మరింత గాఢమైన అనుబంధం ఏర్పడుతుందని చెప్పారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతతో పాటు సమాజంలోని ప్రతి వర్గాన్ని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామ‌న్నారు. మొక్క నాటడంతోనే బాధ్యత పూర్తి కాదని, అది ఆరోగ్యంగా ఎదిగి పెద్ద చెట్టుగా మారే వరకు సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు నాగ‌బాబు.

పర్యావరణ పరిరక్షణ కోసం రూపొందించే ప్రణాళికలు కనీసం 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని చేయాలన్నారు. ఏ ప్రాంతాల్లో ఎలాంటి మొక్కలు, చెట్లు పెంచాలి, భవిష్యత్తులో అక్కడి పర్యావరణ అవసరాలు ఎలా ఉంటాయి అనే అంశాలను అధ్యయనం చేసి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేకంగా తీరప్రాంతాల్లో తాటి చెట్లు, మడ అడవుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తుపాన్లు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో మడ అడవులు, తాటి చెట్లు సహజ రక్షణ కవచంలా పనిచేస్తాయని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!