విజయవాడ : విజయవాడలో 19 రోజుల పాటు జరిగిన సరస్ మేళాకు అపూర్వ స్పందన లభించింది. గ్రామీణ మహిళల పారిశ్రామిక సామర్థ్యాన్ని చాటిచెప్పింది. ఈ జాతీయ ప్రదర్శనలో స్వయం సహాయక సంఘాల సభ్యులు రూ. 12.11 కోట్ల విక్రయాలను నమోదు చేశారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో జరిగిన ‘నేషనల్ సారస్ ఆజీవిక మేళా-2026’ ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ , ఎస్‌ఈఆర్‌పీ అధికారులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ‘లఖ్‌పతి దీదీ’లకు జ్ఞాపికలు, ధృవీకరణ పత్రాలను అందజేసి సత్కరించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘దీనదయాళ్ అంత్యోదయ యోజన – నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్’ , ఏపీ ఎస్‌ఈఆర్‌పీతో కలిసి ఈ ప్రదర్శనను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల నాణ్యత , వారి వ్యాపార నైపుణ్యాలకు ఈ మేళా ఒక వేదికగా నిలిచింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సుమారు 650 స్టాళ్లలో, 50 ఆహార పదార్థాల స్టాళ్లు కూడా ఉన్నాయి.
ఈ ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టాళ్ల ద్వారానే సుమారు రూ. 2 కోట్ల విక్రయాలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు ఢిల్లీ వెలుపల విజయవాడలో తొలిసారిగా నిర్వహించిన ఈ ‘సరస్ మేళాస గ్రామీణ మహిళల్లోని ప్రతిభను, సృజనాత్మకతను , వ్యాపార సామర్థ్యాలను విజయవంతంగా ప్రదర్శించిందని పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో చేనేత వస్త్రాలు, హస్తకళలు, గృహోపకరణాలు, సాంప్రదాయ కళాఖండాలు, ఆహార ఉత్పత్తులు, ప్రాంతీయ ప్రత్యేకతలు వంటి వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉత్పత్తులను ఒకచోట చేర్చారు. గ్రామీణ మహిళలకు అపారమైన నైపుణ్యాలు, వ్యవస్థాపక సామర్థ్యాలు ఉన్నాయని, వారికి తగిన మార్కెట్ అవకాశాలను కల్పించడం ద్వారా వారు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగగలరని కలెక్టర్ డాక్టర్ లక్ష్మీష అన్నారు.
మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు తమ ఉత్పత్తులను విస్తృత మార్కెట్‌లో ప్రదర్శించడానికి, కొత్త వినియోగదారులను చేరుకోవడానికి, వ్యాపార నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేసుకోవడానికి ‘సరస్ మేళా’ ఒక అవకాశాన్ని కల్పించిందని ఆయన తెలిపారు. బ్రాండింగ్, ప్యాకేజింగ్, ఉత్పత్తి నాణ్యత, ధరల నిర్ణయం, మార్కెటింగ్ వ్యూహాలు, డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ అమ్మకాలు, సోషల్ కామర్స్, ఎగుమతి అవకాశాలపై వర్క్‌షాప్‌లు, శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించినట్లు ఆయన చెప్పారు. మహిళలు తమ ఉత్పత్తులను మెరుగు పరచుకోవడానికి, వ్యాపారాలను విస్తరించు కోవడానికి నిపుణులు ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందించారు. వివిధ రాష్ట్రాల సాంప్రదాయ నృత్యాలు, జానపద కళలు, సంగీతంతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ ప్రదర్శనకు మరింత ఆకర్షణను జోడించాయి.
