53 రోజుల అక్ర‌మ నిర్బంధం మ‌రిచి పోలేను : సీఎం

2047 నాటికి తెలుగు జాతిని అగ్ర‌గామిగా నిల‌బెడ‌తా

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ‌త వైసీపీ పాల‌న‌లో త‌న‌ను 53 రోజుల పాటు అక్ర‌మంగా నిర్బంధించ‌డాన్ని మ‌ళ్లీ గుర్తు చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న త‌న జీవితంలో మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నారు. లక్షలాది హృదయాల నుంచి వచ్చిన స్పందన ఇప్ప‌టికీ గుర్తు ఉంద‌న్నారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున 53 రోజుల అక్రమ నిర్బంధం తర్వాత నేను రాజమహేందడవరం సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చాను. అప్పట్లో మేము విధ్వంసకర పాలనను ప్రశ్నించే సాహసం చేసినప్పుడు, దాన్ని సహించలేని పాలకులు ప్రజలను, ప్రతిపక్షాన్ని అణచి వేయాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే, కనీస నోటీసు కూడా ఇవ్వకుండా నంద్యాలలో అర్ధరాత్రి నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు. అది ఒక అక్రమ నిర్బంధమని, కుట్ర పూరితమైన అరెస్టు అని అందరికీ తెలుసు. నా నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో, ఆ 53 రోజులు అత్యంత కఠినమైనవి. కోర్టు తీర్పుతో, సరిగ్గా ఇదే రోజున, నేను తిరిగి ప్రజల మధ్యకు వచ్చాను. నేను జైలులో ఉన్నప్పుడు నాకు అండగా నిలిచిన లక్షలాది మంది తెలుగు ప్రజల మద్దతును నా జీవితకాలంలో ఎప్పటికీ మర్చిపోలేను. నన్ను నిర్బంధించి ఒంటరిని చేయాలని చేసిన కుట్రలు, మొత్తం తెలుగు జాతి తిరుగుబాటుతో ఛిన్నా భిన్నమయ్యాయి. ఈ సందర్భంగా, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాను.

అణచివేతదారుల చర్యలను ఎదిరిస్తూ తెలుగు జాతి చూపిన చొరవ నన్ను నిలబెట్టింది. మంచి పాలనా విధానాల ద్వారా ప్రజలకు మేలు జరిగినప్పుడు, వారు ఎంతగా గుర్తుంచుకుంటారో, ఎంతగా అండగా నిలుస్తారో ప్రజల స్పందన నిరూపించింది. ముఖ్యంగా, ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ, గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ (కృతజ్ఞతా) కార్యక్రమానికి వేలాది మంది యువత, సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఇతర వృత్తి నిపుణులు తరలివచ్చి నాకు మద్దతు తెలపడం ఆ క్షణం నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి పోతుంది. నేను చేపట్టిన సంస్కరణలు, కల్పించిన అవకాశాల ద్వారా మంచి ఉద్యోగాలు పొందిన వారు, స్వచ్ఛందంగా కృతజ్ఞతా భావంతో వీధుల్లోకి రావడం నిజంగా అద్భుతం. రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా… మరియు ప్రపంచ వ్యాప్తంగా 60కి పైగా దేశాల్లో తెలుగు ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

అప్పటి పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా వారు నిరసన తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యలను ఖండించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ మహిళల నుండి ప్రపంచ స్థాయి కార్పొరేట్ సంస్థల సీఈఓల వరకు… రైతుల నుండి సాఫ్ట్‌వేర్ నిపుణుల వరకు… విద్యార్థుల నుండి ప్రవాసాంధ్రుల వరకు… సమాజంలోని ప్రతి వర్గం నుండి లభించిన అపూర్వమైన మద్దతు గతంలో ఎన్నడూ లేనిది. రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే నా భార్య, నా కుటుంబ సభ్యులు కూడా ‘సత్యమే గెలవాలి’ అని మీతో గొంతు కలిపి, మీతో కలిసి అడుగు ముందుకు వేసి, సత్యాన్ని గెలిపించారు. వారు ధర్మాన్ని నిలబెట్టారు. ఈ సందర్భంగా, నాకు సంఘీభావం తెలిపిన ప్రతి పౌరుడికి, కార్యకర్తకు, అభిమానికి, ప్రజాస్వామ్యవాదికి ,ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికీ నేను మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. నా కష్టాన్ని తమ కష్టంగా భావించి స్పందించిన వారికి, మంచితనం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ ప్రేమను, అభిమానాన్ని, నమ్మకాన్ని నా జీవితాంతం భద్రంగా ఉంచుకుంటాను. మీరు నాకు అండగా నిలిచినట్లే, నేను కూడా చివరి వరకు మీకు అండగా ఉంటాను. మీ నమ్మకమే, మీ అభిమానమే నా బలం. మీ భవిష్యత్తును తీర్చిదిద్దడమే నా సంకల్పం. మీ అందరి సహకారం, భాగస్వామ్యంతో 2047 నాటికి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలనే నా నిశ్చయాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నాను అని తెలిపారు నారా చంద్ర‌బాబు నాయుడు.

Leave A Reply

Your Email Id will not be published!