అన్నదాతలంతా అప్రమత్తంగా ఉండాలి : అచ్చెన్నాయుడు
భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలి
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నవంబర్ 2వ తేదీ సాయంత్రానికి తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపించే అవకాశం ఉందని, నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. భారీ వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా రైతులు ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. వరి, పత్తి, మిర్చి, ఉద్యాన పంటల పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా కాలువలను సిద్ధం చేసుకోవాలని, కోతలు పూర్తయిన పంట ఉత్పత్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించి తడవకుండా కాపాడు కోవాలని తెలిపారు.
వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు పంట కోతలు, పురుగు మందుల పిచికారీ, ఎరువుల వినియోగాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు అచ్చెన్నాయుడు. బలమైన గాలులు, పిడుగులు పడే సమయంలో రైతులు పొలాల్లోకి వెళ్లవద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా వాతావరణ శాఖ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులు రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా గ్రామస్థాయిలో అందుబాటులో ఉంటూ పంటల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమన్వయం చేసుకొని పంట నష్టాన్ని తగ్గించే సాంకేతిక సూచనలు అందించాలని, అవసరమైన విత్తనాలు, ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
వర్షాల ప్రభావంతో ఎదురయ్యే సమస్యలపై వెంటనే స్పందించాలని, రైతుల నుంచి అందే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించాలని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు. ఇటీవల తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు మరోసారి వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా ఇచ్చారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, ప్రతి రైతుకు అండగా నిలవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసే తాజా సూచనలను రైతులందరికీ చేరవేయాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
