టీటీడీ సిబ్బందికి ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ పై శిక్ష‌ణ

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి రవిచంద్ర

తిరుమ‌ల : టీటీడీ ఈవో ముద్దాడ ర‌విచంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. టీటీడీ ప‌రిపాల‌నా విభాగంలో ఆధునిక సాంకేతిక‌త‌ను వినియోగించ‌నున్న‌ట్లు తెలిపారు. అంతే కాకుండా ప్ర‌తి నిత్యం ద‌ర్శించుకునే శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. ఇదిలా ఉండ‌గా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సిబ్బందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే అర్హులైన టీటీడీ ఉద్యోగులందరికీ సకాలంలో పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్ల‌డించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పదవీ విరమణ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని సూచించారు. ఐఐటీలు , ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన నిపుణుల ద్వారా ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు.

పరిపాలనా వ్యవహారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రవేశ పెట్టడం ద్వారా పని వేగం పెరగడమే కాకుండా, ఆలయ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఈవో రవిచంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పదవీ విరమణ చేస్తున్న 29 మంది ఉద్యోగులను ఆయన ఘనంగా సత్కరించారు. పదవీ విరమణ పొందుతున్న వారు తమ సుదీర్ఘ అనుభవాలను, ఉత్తమ పని పద్ధతులను ప్రస్తుత సిబ్బందితో పంచుకోవాలని, తద్వారా అవి భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలుగా ఉంటాయని ఆయన కోరారు. వారి అంకితభావంతో కూడిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారి పదవీ విరమణ అనంతర జీవితం ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ చేస్తున్న 29 మంది ఉద్యోగులకు శాలువాలు కప్పి, శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేసి, వేద పండితుల ఆశీర్వచనాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో (ఆరోగ్యం, విద్య) ప్రభాల గోపీనాథ్, అదనపు ఎఫ్ఏ అండ్ సీఏఓ రవి ప్రసాద్, డిప్యూటీ ఈవో ఆనందరాజు, కార్మిక సంఘాల ప్రతినిధులు, పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!