అసెంబ్లీలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తాం

భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శాస‌న స‌భ‌లో పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తామ‌ని అన్నారు. అత్యంత ప్రాధాన్యతతో లేవనెత్తుతామని పేర్కొన్నారు. మ‌హాత్మా గాంధీ యూనివర్సిటీ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు కేటీఆర్ ను క‌లిశారు. తమ సమస్యలను వివరిస్తూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. పాలిటెక్నిక్ కళాశాలల భూములు, విద్యా సంస్థల భవిష్యత్తు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలను విద్యార్థులు కేటీఆర్ దృష్టికి తీసుకు వచ్చారు. తమ సమస్యలకు ప్రభుత్వం నుండి స్పష్టమైన పరిష్కారం లభించాలని వారు కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సెప్టెంబర్ 7 నుండి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్ర‌క‌టించారు.

ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాధానం వచ్చే వరకు ఈ విషయంపై పూర్తి స్పష్టత లభించే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టబోమని ఆయన హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్న ప్రాంతాల్లోని విలువైన భూములపై ​​ప్రభుత్వం చూపిస్తున్న ఆసక్తి పట్ల ఉన్న ఆందోళనలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. జర్మనీ తరహాలో చదువుతో పాటు పని అనుభవాన్ని జోడించే ‘డ్యూయల్ ప్రోగ్రామ్స్’, అప్రెంటిస్‌షిప్‌లు , ప్రాక్టీస్ స్కూల్స్ వంటి విధానాలను అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తామ‌న్నారు. విద్యార్థులకు మెరుగైన సాంకేతిక నైపుణ్యాలను అందించే విధానాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసెంబ్లీలో వారి సమస్యల కోసం బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడుతుందని భరోసా ఇచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!