ఫ్యూచ‌ర్ సిటీలో ప్ర‌పంచ స్థాయి స్టేడియం

ప్ర‌ణాళిక‌లు త‌యారు చేయాల‌ని సీఎం ఆదేశం

హైద‌రాబాద్ : సీఎంగా కొలువు తీరిన త‌ర్వాత రేవంత్ రెడ్డి ఎక్కువ‌గా ఫ్యూచ‌ర్ సిటీ మీద‌నే దృష్టి సారించారు. అన్ని రంగాల‌కు ఇదే కేంద్రంగా ఉండేలా చూస్తున్నారు. ఇక్కడి వ‌ర‌కు మెట్రో ను కూడా విస్త‌రించాల‌ని ఫోక‌స్ పెట్టారు. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ‘ఫ్యూచర్ సిటీ’లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రేవంత్ ప్రణాళిక ర‌చించే ప‌నిలో ప‌డ్డారు. గుజరాత్‌లోని 1.32 లక్షల సామర్థ్యం గల నరేంద్ర మోదీ స్టేడియంతో పోటీపడే స్థాయి సీటింగ్ సామర్థ్యంతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రూపొందుతున్న ఈ అత్యాధునిక స్టేడియం, ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ , ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత స్టేడియం మెల్ బోర్న్ తరహాలో నిర్మించాల‌ని నిర్ణ‌యించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలితో కలిసి చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు డిసెంబర్‌లో శంకుస్థాపన జరగనుంది. నిర్మాణం పూర్తయ్యాక ఇది ప్రపంచంలోని అత్యుత్తమ స్టేడియాలలో ఒకటిగా గుర్తింపు పొందుతుందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ఫ్యూచర్ సిటీ పరిధిలో స్టేడియం కోసం అనువైన స్థలాన్ని అన్వేషిస్తున్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం కంటే ఎక్కువ సీటింగ్ సామర్థ్యంతో దీనిని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వ్యయ అంచనాలు ఇంకా ఖరారు కావాల్సి ఉన్నప్పటికీ, నిర్మాణ ఖర్చులు గుజరాత్ స్టేడియం వ్యయాన్ని మించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఉమ్మడి భాగస్వామ్యంలో భాగంగా నిర్మాణ , నిర్వహణ ఖర్చులను బీసీసీఐ భరిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తుంది. ఈ భాగస్వామ్యాన్ని అధికారికం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీకి విస్తరించనున్న మెట్రో రైలు మార్గం , షంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ స్టేడియం రవాణా పరంగా అత్యుత్తమ అనుసంధానాన్ని కలిగి ఉంటుందని వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రీడా సముదాయం ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో కీలక భాగంగా నిలవనుంది. ఉప్పల్ స్టేడియంను కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా ఇతర క్రీడలకు కూడా అనుకూలంగా ఉండేలా పునః రూపకల్పన చేయనున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!