న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రధాన మంత్రి ఈ డ్రైవ్ పథకాన్ని వచ్చే 2028 సంవత్సరం మార్చి నెల వరకు పొడిగించినట్లు వెల్లడించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీని రూ. 5,000 నుండి సగానికి రూ. 2,500కు తగ్గించింది. ఈ ప్రోత్సాహకాన్ని పొందడానికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల గరిష్ట ఎక్స్-ఫ్యాక్టరీ ధర రూ. 1.5 లక్షలుగా నిర్ణయించింది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి దీనికి మొత్తం రూ. 2,767 కోట్ల నిధుల మద్దతు లభిస్తుంది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడం, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం తో పాటు ఈవీ తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం రూ. 11,900 కోట్ల వ్యయంతో పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. దీనిని ఏప్రిల్ 1, 2024 నుండి మార్చి 31, 2028 వరకు అమలు చేయనున్నారు. అయితే ఈ విభాగం కోసం అందించే ప్రోత్సాహకాలను గతంలో ఉన్న రూ. 5,000 నుండి సగానికి, అంటే రూ. 2,500కు తగ్గించింది.
భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 1, 2025 , మార్చి 31, 2028 మధ్య కాలంలో నమోదైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రూ. 2,500 చొప్పున ప్రోత్సాహకాన్ని పొందవచ్చు . దీనితో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రూ. 5,000 చొప్పున ప్రోత్సాహకాన్ని పొందేందుకు అర్హత కలిగి ఉండేవి. అయితే వాహనానికి గరిష్టంగా రూ. 10,000 పరిమితితో అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రోత్సాహకాన్ని పొందేందుకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల గరిష్ట ‘ఎక్స్-ఫ్యాక్టరీ’ ధర రూ. 1.5 లక్షలుగా నిర్ణయించారు. ఈ ప్రోత్సాహకం పైన పేర్కొన్న పరిమితికి లేదా ఎలక్ట్రిక్ ద్విచక్ర/త్రిచక్ర వాహనాల ఎక్స్-ఫ్యాక్టరీ ధరలో 15 శాతానికి (వీటిలో ఏది తక్కువైతే అది) పరిమితం చేయబడుతుంది. ఇది నిధుల పరిమితి కలిగిన పథకం. ఈ పథకం కింద మొత్తం చెల్లింపులు రూ. 11,900 కోట్ల కేటాయింపునకు లోబడి ఉంటాయి.
