న్యూఢిల్లీ : మోడీ సర్కార్ కు ప్రతికూలత ఎదురవుతోంది. 3.92 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారత ఆర్థిక వ్యవస్థ ఆరో స్థానానికి పడిపోయింది. ఇది ఒక రకంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ ఐఎంఎఫ్ ర్యాంకింగ్‌లు ప్రస్తుత యూఎస్ డాలర్ మారకపు రేట్ల వద్ద కొలిచిన నామమాత్ర జీడీపీపై ఆధారపడి ఉన్నాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ఒక విస్తృత వ్యూహాన్ని అవలంబించిందని తెలిపారు. ఈ వ్యూహం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, పీఎల్ఐ పథకాలుచ నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను సడలించడం వంటి కార్యక్రమాల ద్వారా తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను విస్తరించడం, లాజిస్టిక్స్‌ను మెరుగు పరచడం , ఆవిష్కరణ, డిజిటలైజేషన్, పరిశోధనలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది అని ఆయన అన్నారు.
2025-26 సంవత్సరానికి భారతదేశ నామమాత్ర స్థూల దేశీయోత్పత్తి 3.92 ట్రిలియన్ డాలర్లుగా ఉందని, ఇది భారతదేశాన్ని ప్రపంచంలో ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుపుతుందని ప్రభుత్వం తెలిపింది. దేశ జీడీపీలో తగ్గుదల ధోరణి ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ఒక విస్తృత వ్యూహాన్ని అవలంబించిందని పార్లమెంటుకు తెలియ చేసింది. యూఎస్ డాలర్ మారకపు రేట్ల వద్ద కొలవబడిన నామమాత్రపు జీడీపీపై ఆధారపడి ఉంటాయని అన్నారు మంత్రి. ఫలితంగా, ఆర్థిక వృద్ధి, మారకపు రేట్లు , ధరలలో కదలికలు, జాతీయ ఖాతాల సవరణలు, ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల పరిమాణం, వృద్ధిలో మార్పులతో సహా అనేక కారణాల కలయిక వల్ల ఆర్థిక వ్యవస్థల సాపేక్ష ర్యాంకింగ్ మారవచ్చు అని ఆయన అన్నారు.
ప్రభుత్వం నిరంతర ప్రభుత్వ మూలధన వ్యయం, సరళీకృత ఎఫ్‌డీఏ విధానం, ప్రత్యక్ష పన్ను , జీఎస్టీ సంస్కరణల ద్వారా సమర్థవంతమైన పన్ను విధానం, అలాగే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నిరంతర మెరుగుదల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని ఆయన పేర్కొన్నారు.
