హైదరాబాద్ : పర్యాటక , హాస్పిటాలిటీ రంగాల్లో భారత్–ఫ్రాన్స్ మధ్య విద్యా, వృత్తిపరమైన, సంస్థాగత సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ , హైదరాబాద్ ఆధ్వర్యంలో పర్యాటక మరియు హాస్పిటాలిటీ రంగాల్లో ఇండో–ఫ్రెంచ్ సహకారాన్ని బలోపేతం చేయడం అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్, ఫ్రెంచ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మార్క్ లామీ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, చైర్‌పర్సన్ వాణి ప్రసాద్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. దేశాల మధ్య బలమైన సంబంధాలు కేవలం దౌత్యపరమైన చర్చలతోనే కాకుండా ప్రజల మధ్య పరస్పర సంబంధాలు, సాంస్కృతిక అవగాహన, ఉమ్మడి అనుభవాల ద్వారా కూడా ఏర్పడతాయని ఆమె పేర్కొన్నారు.ఆహారం, గ్యాస్ట్రోనమీ, సంస్కృతి, పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాలు ప్రజలు , దేశాలను మరింత దగ్గర చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
సాంస్కృతిక మార్పిడి ద్వారా ఇతర దేశాల కొత్త ఆలోచనలు, దృక్పథాలను తెలుసుకోవడంతో పాటు, మన సంప్రదాయాలు, వారసత్వంలోని గొప్పతనాన్ని ఇతరులకు పరిచయం చేసే అవకాశం లభిస్తుందని వాణి ప్రసాద్ తెలిపారు. భారత్, ఫ్రాన్స్ మధ్య స్నేహం, పరస్పర అవగాహనను మరింత బలోపేతం చేయడంలో ప్రతి సంభాషణ, ప్రతి సాంస్కృతిక పరస్పర చర్య దోహద పడుతుందని చెప్పారు. విద్యార్థులు, అధ్యాపకులు అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, ఫ్రెంచ్ సంస్కృతి, సమాజం గురించి తెలుసుకునేందుకు వచ్చిన ప్రముఖ అతిథితో స్వేచ్ఛగా సంభాషించి ప్రశ్నలు అడగాలని ఆమె సూచించారు.
డైరెక్టర్ ప్రొఫెసర్ వి. వెంకట రమణ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక, హాస్పిటాలిటీ రంగాలకు విద్యార్థులను సిద్ధం చేయడంలో అంతర్జాతీయ సహకారం ఎంతో కీలకమని అన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ పరిశ్రమలు, విద్యా సంస్థలతో కలిసి అధ్యాపకులు, విద్యార్థులు సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఫ్రెంచ్ భాషా శిక్షణను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
