ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తాం

హైద‌రాబాద్ : నిషేధిత ఆస్తుల జాబితా 22ఏ -లో ఉన్న భూముల విషయంలో ప్రజలు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, చట్టపరంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం నిషేధిత జాబితాలో కొత్తగా ఏ భూములను చేర్చలేదని, గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న సాంకేతిక, చట్టపరమైన అడ్డంకులను పరిష్కరించి బాధితులకు ఉపశమనం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి జీవోలు (GOs), ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రక్రియ పత్రాలు, లేఅవుట్ అనుమతులు, ఇతర వివరాలతో సహా అన్ని పత్రాలను ఈ నెల 14వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీనివల్ల నకిలీ పత్రాల సమస్యను అరికట్టవచ్చు అన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో సబ్-రిజిస్ట్రార్లకు స్పష్టత లభిస్తుందన్నారు. పత్రం అసలైనదా లేక నకిలీదా అని క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు మంత్రి.

పారదర్శకతను పెంచేందుకు సబ్-రిజిస్ట్రార్లకు కూడా ‘పహానీ’ రికార్డులను చూసే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందిన దరఖాస్తులలో నిజమైన వాటిని గుర్తించి, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలు , ఆదేశాలకు అనుగుణంగా ప్రజల కోణాన్ని దృష్టిలో ఉంచుకుని కలెక్టర్లు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో కలెక్టర్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. తన కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి , సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు అలాగే ఆయా జిల్లాల సబ్-రిజిస్ట్రార్లతో మంత్రి 22A/POBI అంశంపై సమగ్రంగా చర్చించారు.

22A అంశానికి సంబంధించి బహిరంగ ప్రకటనలతో పాటు, కలెక్టర్లు, ఆర్డీవోలు (RDOs), తహసీల్దార్లు, సబ్-రిజిస్ట్రార్లకు అందిన దరఖాస్తుల వివరాలను జిల్లా వారీగా సమీక్షించారు. అలాగే, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించారు. సబ్-రిజిస్ట్రార్లకు విచక్షణాధికారాలు లేదా అదనపు అధికారాలు ఉండకూడదని ఈ విషయంపై గతంలోనే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామ‌న్నారు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వాటిని ఆమోదించడానికి మాత్రమే తమ అధికారాన్ని పరిమితం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు.

అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు కేవలం కలెక్టర్ , జిల్లా రిజిస్ట్రార్ మధ్య మాత్రమే జరగాలి. గతంలో వ్యవసాయ, వ్యవసాయేతర , పీఓబీఐ జాబితాలు వేర్వేరుగా ఉండేవన్నారు. ఇప్పుడు వాటిని ఏకీకృతం చేయడం వల్ల, సబ్-రిజిస్ట్రార్లు పరిశీలించినప్పుడు కొన్ని ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నట్లు కనిపిస్తున్నాయని, తద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచి పోతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. తాజాగా అప్‌లోడ్ చేసిన సమాచారంతో సరి చూసుకుని నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!