ఉత్తర ప్రదేశ్ : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది అయోధ్య రామ మందిరంలో చోటు చేసుకున్న విరాళాల స్కాం. తాజాగా ప్రక్షాళన చేపట్టింది. అయోధ్య రామమందిర ట్రస్ట్ పూర్తి స్థాయి ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సీఈఓ) ఎంపిక కోసం ఇంటర్వ్యూలను ప్రారంభించింది. ఈ పోస్టు కోసం మొత్తం 5,200 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అనుభవం, అర్హత ఆధారంగా 18 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరంతా నిన్న రాత్రి అయోధ్యకు చేరుకున్నారు. ట్రస్ట్ సూచించిన విధంగా ఆ పుణ్యక్షేత్రంలోని వివిధ ప్రాంతాల్లో బస చేశారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మొదటి పూర్తి స్థాయి సీఈఓ నియామకం కోసం ఒక ఉన్నత స్థాయి కమిటీ మంగళవారం అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తోంది. రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ట్రస్ట్ పూర్తి స్థాయి సీఈఓను నియమించాలని నిర్ణయించింది.
అయోధ్యలోని రామమందిర యాత్రికుల సేవా కేంద్రం కాన్ఫరెన్స్ గదిలో ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ జరుగుతోంది. ఒకవేళ మంగళవారం నాటికి ఇంటర్వ్యూలు పూర్తవక పోతే ఈ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగవచ్చని ట్రస్ట్ వర్గాలు తెలిపాయి. అభ్యర్థులు ఉదయం 9 గంటల ప్రాంతంలో రామమందిర ప్రాంగణానికి చేరుకోగా ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు తమ రాక వివరాలను ముందుగానే తెలిపారు. ట్రస్ట్ నియమించిన వ్యక్తులు వారిని తీసుకు వచ్చారు. విమానాశ్రయం నుండి వేర్వేరు వాహనాల్లో వారిని వివిధ ప్రాంతాలకు తరలించారు. అభ్యర్థులు మీడియాతో మాట్లాడవద్దని సూచించారు. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత వారందరినీ తిరిగి అయోధ్య విమానాశ్రయానికి తీసుకెళ్లి అక్కడి నుండి న్యూఢిల్లీకి విమానం ఎక్కేలా చేస్తారు. ఢిల్లీ నుండి వారు తమతమ గమ్యస్థానాలకు విమానాల్లో వెళ్తారు.
ఈ 18 మంది అభ్యర్థులలో మాజీ ఉన్నతాధికారులు , దక్షిణ భారతదేశంలోని ఆలయాలలో గతంలో కీలక పదవులు నిర్వహించిన వారు ఉన్నారని సమాచారం. ఎంపిక ప్రక్రియ కోసం ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ అయోధ్యకు చేరుకుంది. 18 మంది దరఖాస్తుదారుల నుండి తుది నిర్ణయం కోసం ట్రస్ట్ ముగ్గురు వ్యక్తుల పేర్లను ఎంపిక చేయనుంది. ఈ ప్యానెల్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) , విష్ణుకాంత్ చతుర్వేది , సురేష్ హవారే సభ్యులుగా ఉన్నారు.
