వెటర్నరీ సైన్సెస్ కోర్సులకు నీట్ అక్క‌ర్లేదు : సీఎం

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి జోసెఫ్ విజ‌య్ లేఖ

చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే కీల‌క నిర్ణ‌యాల‌తో దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ సీఎంగా పేరు పొందారు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. ఈ సంద‌ర్బంగా ఆయ‌న గ‌త కొంత కాలంగా నీట్ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా ప్ర‌ధాని మోదీకి సుదీర్ఘ లేఖ రాశారు. వెటర్నరీ సైన్సెస్ కోర్సులకు నీట్ అక్క‌ర్లేద‌న్నారు. అది ఎంత మాత్రం ప్రామాణికం కానే కాద‌న్నారు. ఇదిలా ఉండ‌గా వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్ని వెటర్నరీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఒక ఉమ్మడి ప్రవేశ పరీక్షను తప్పనిసరి చేసింది. అయితే, ‘బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బండరీ’ డిగ్రీ కోర్సులో ప్రవేశాలను హయ్యర్ సెకండరీ పరీక్ష మార్కుల ఆధారంగా లేదా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన ప్రమాణాల ఆధారంగా చేపట్టేలా వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సూచించాలని కోరారు సీఎం విజ‌య్ జోసెఫ్ చంద్ర‌శేఖ‌ర్.

వెటర్నరీ కోర్సులకు నీట్ ని ప్రవేశ పెట్టడం సముచితం కాదని ఆయన పేర్కొన్నారు. ప్రధానికి రాసిన లేఖలో కేంద్రీకృత కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా సీట్ల కేటాయింపు , ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని నిర్ణయించారని తెలిపారు సీఎం. అటువంటి పరీక్షను నిర్వహించని రాష్ట్రాలు 2026-27 విద్యా సంవత్సరం నుండి నీట్ (UG)-2026 మెరిట్ జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించిన విషయం తన దృష్టికి వచ్చిందని విజయ్ తెలిపారు. ఈ చర్య వెటర్నరీ విద్యలో సమాన అవకాశాలను కాపాడదని వాపోయారు. గ్రామీణ , సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థుల అవకాశాలను రక్షించదని , రాష్ట్రాల విధాన పరమైన నిర్ణయాలను గౌరవించదని ఆయన పేర్కొన్నారు. వెటర్నరీ విద్య అనేది కేవలం ఒక వృత్తిపరమైన కోర్సు మాత్రమే కాదని, అది పశుసంవర్ధక రంగాన్ని బలోపేతం చేయడానికి, పశువుల ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి, పాడి పరిశ్రమ అభివృద్ధికి, లక్షలాది గ్రామీణ కుటుంబాల జీవనోపాధిని భద్రపరచడానికి ఒక పునాది అని స్ప‌ష్టం చేశారు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

దశాబ్దాలుగా తమిళనాడు వృత్తిపరమైన కోర్సులలో ప్రవేశాల కోసం హయ్యర్ సెకండరీ పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారిత విధానాన్ని అనుసరిస్తోందని, ఇది సామాజిక న్యాయం, ప్రాంతీయ సమానత్వం , సమ్మిళిత అభివృద్ధికి సమర్థవంతమైన సాధనంగా పనిచేసిందని ఆయన చెప్పారు. ఈ విధానం సమర్థులైన నిపుణులను నిరంతరం అందించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆర్థికంగా బలహీన వర్గాలు , సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి సమాన అవకాశాన్ని కల్పించిందని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!