సిద్ది వినాయ‌క గుడిలో ప్ర‌తి ఏటా రూ. 18 కోట్ల అప‌హ‌ర‌ణ‌

షాకింగ్ కామెంట్స్ చేసిన ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే

ముంబై : మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీ అధ్య‌క్షుడు రాజ్ ఠాక్రే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మ‌రాఠా లోని సిద్ధి వినాయక ఆలయంలో ఏటా రూ. 18 కోట్ల మేర నిధుల అపహరణ జరుగుతోందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా సిద్ది వినాయ‌క‌తో పాటు ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని అయోధ్య రామ మందిరంలోనూ రూ. 1,400 కోట్ల కుంభకోణం జరిగిందని మండిప‌డ్డారు. ఈ భారీ స్కాంపై దేశ ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. ముంబైలోని ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయంలో ప్ర‌తి సంవ‌త్స‌రం పెద్ద ఎత్తున కోట్లాది రూపాయ‌లు చోరీ అవుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ రోజుల్లో ఆలయాలు కూడా సురక్షితంగా లేవని వ్యాఖ్యానించిన ఠాక్రే, ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించాలని అన్నారు.

తాజాగా తన పార్టీ విద్యార్థి విభాగం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. నిరాశతో ఉన్న యువత ఆలయాలకు వెళ్తుంటారు, కానీ అక్కడ కూడా అవినీతి నుంచి రక్షణ లేదని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సిద్ధివినాయక ఆలయ హుండీ నుంచి డబ్బు కాజేసిన కొందరు ఉద్యోగులు ట్రస్టీల అప్రమత్తత వల్ల పట్టుబడ్డారని ఠాక్రే తెలిపారు; ఈ సందర్భంగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు ఎనిమిది మంది ట్రస్టీలు రాసిన లేఖను ఆయన చదివి వినిపించారు. ఈ అపహరణ వ్యవహారం బయట పడక ముందు ఆలయానికి విరాళాల రూపంలో వచ్చే వారపు ఆదాయం రూ. 50 లక్షల లోపే ఉండేదని, ఆ తర్వాత ఆ మొత్తం రూ. 1.5 కోట్లకు పెరిగిందని చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!