ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ లో రష్మిక మందన్న
చెన్నైలో ఘనంగా ప్రారంభోత్సవం కానుంది కార్యక్రమం
చెన్నై : ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ దేశ వ్యాప్తంగా చర్చించుకునేలా చేసింది. తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. చెన్నైలో జరగనున్న ఒక భారీ ప్రారంభోత్సవ కార్యక్రమంతో మొదలు కానుంది బయోపిక్. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ , బివి వర్క్స్ బ్యానర్‌లపై అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్ , బన్నీ వాసు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రను రష్మిక మందన్న పోషించనుండగా ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం 2026 సెప్టెంబర్ 16న బుధవారం చెన్నైలోని ‘ది మ్యూజిక్ అకాడమీ’లో జరగనుంది. ఈ కార్యక్రమానికి నటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు . ఈ వేడుకలో ‘ఇండియన్ కోరల్ ఎన్సెంబుల్’ బృందం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాడిన ప్రసిద్ధ గీతాలను ప్రత్యక్షంగా ఆలపించనుంది. ఈ కార్యక్రమం కోసం నిర్వాహకులు ‘ఎంఎస్ బ్లూ’ రంగు దుస్తులను ప్రత్యేక డ్రెస్ కోడ్‌గా నిర్ణయించినట్లు సమాచారం. ఈ బయోపిక్ ద్వారా ఆ గొప్ప గాయని జీవితం, ఆమె వారసత్వంతో పాటు ప్రజలకు అంతగా తెలియని ఆమె జీవితంలోని విశేషాలను కొత్త తరానికి పరిచయం చేయాలన్నది ప్రధాన ఉద్దేశ్యం. ఈ భారీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
