అమరావతి : ఏపీకి చెందిన మాజీ మంత్రి ఆళ్ల నాని మంగళవారం హఠాన్మరణం చెందారు. ఆయన మృతితో తెలుగుదేశం పార్టీలో విషాదం అలుముకుంది. ఆళ్ల నానిగా ప్రసిద్ధి చెందిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఏలూరు నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి , ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 30 డిసెంబర్ 1969లో పుట్టారు. ఆయన స్వస్థలం ఏలూరు. ఆళ్ల నాని తొలుత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. 1999లో ఏలూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2004లో తిరిగి అదే పార్టీపై పోటీ చేసి శాసన సభ్యుడిగా గెలుపొందారు. 2009లో ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా తిరిగి విజయం సాధించారు ఆళ్ల నాని. 2013లో ఆయన అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. జగన్ మోహన్ రెడ్డి స్తాపించిన వైఎస్ఆర్సీపీ లో చేరారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2017లో ఆయన అనుభవం, రాజకీయ నేపథ్యం కారణంగా 2017లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. .
2019లో ఏలూరు నుంచి వైసీపీ తరఫున మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆళ్ల నానికి కీలక బాధ్యతలు లభించాయి. 2019 నుంచి 2022 వరకు ఆళ్ల నాని ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పని చేశారు. కోవిడ్ సమయంలో కీలక భూమిక పోషించారు.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆళ్ల నాని ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2024 ఆగస్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తర్వాత రాజకీయ పరిణామాలు మారాయి. 2025 ఫిబ్రవరి 13న ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన చంద్రబాబు నాయుడిని కలసి టీడీపీ కండువా కప్పుకున్నారు. అనుకోకుండా తమను ఆళ్ల నాని వీడడం పట్ల సీఎం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ రెడ్డి సంతాపం తెలిపారు.
