ఇంగ్లండ్ : తమిళనాడు ముఖ్యమంత్రి లండన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. తమ కూటమి సర్కార్ తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. ఈ పర్యటనలో అతిపెద్ద పెట్టుబడి ప్రతిపాదన ప్రముఖ ఆటో విడిభాగాల తయారీ సంస్థ ‘సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్’ నుండి వచ్చింది. తన యూరోపియన్ , యూకే-ఆధారిత జాయింట్ వెంచర్ సంస్థలతో కలిసి రాబోయే ఐదేళ్లలో సుమారు రూ. 11,000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఈ సంస్థ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం మదర్సన్ తమిళనాడులోని కీలక ప్రాంతాలలో డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, అసెంబ్లీ , లాజిస్టిక్స్ సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. ఈ ఒక్క ప్రాజెక్ట్ ద్వారానే అధునాతన ఇంజనీరింగ్ , సరఫరా గొలుసు (సప్లై చైన్) కార్యకలాపాలలో దాదాపు 7,000 ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
రాష్ట్ర ప్రతినిధి బృందం లండన్‌లో సుమారు రూ. 12,300 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పలు ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఆసియాలోనే అగ్రగామి అధునాతన తయారీ , సాంకేతిక కేంద్రంగా తమిళనాడును తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ పెట్టుబడుల కార్యక్రమం, రాష్ట్ర వ్యాప్తంగా 9,400కు పైగా విలువైన ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. అయితే, ఇంగ్లాండ్‌లోని సిల్వర్‌స్టోన్ మోటార్ రేసింగ్ సర్క్యూట్‌ను సందర్శించడం వంటి అంశాలతో కూడిన సీఎం ఈ హై-ప్రొఫైల్ యూకే పర్యటనపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసింది. దూషించడం, అవమానించడం, అనుమానించడం డీఎంకే , అన్నాడీఎంకే పార్టీల పని అని అందుకే ప్రజలు వారిని పక్కన పెట్టారని తమిళనాడు రాష్ట్ర మంత్రి రమేష్ విమర్శించారు. తమ నాయకుడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే యూకే పర్యటించారని తెలిపారు.
