పీసీబీ చైర్మన్ నుంచి కప్ తీసుకునేందుకు నిరాకరణ
సంచలనంగా మారిన భారత మహిళా క్రికెట్ జట్టు నిర్ణయం
దుబాయ్ : ఆసియా కప్ ను భారత మహిళా జట్టు కైవసం చేసుకుంది. శ్రీలంక ను ఓడించింది. విశ్వ విజేతగా నిలిచింది. గతంలో తమకు జరిగిన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇదిలా ఉండగా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఏసీసీ చైర్మన్ అయిన నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకునేందుకు భారత జట్టు అమ్మాయిలు నిరాకరించడం కలకలం రేపింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మల అర్ధశతకాలు , శ్రీ చరణి సాధించిన నాలుగు వికెట్ల ప్రదర్శనతో భారత మహిళల జట్టు శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి తమ ఎనిమిదవ ఆసియా కప్ టైటిల్‌ను (T20 ఫార్మాట్‌లో నాలుగవది) కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక క్రీడాకారిణులు రన్నరప్ పతకాలను స్వీకరించడానికి వేదికపైకి వెళ్లగా, ఆ జట్టు కెప్టెన్ చమరి అథపత్తుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కూడా అయిన నక్వీ ఒక చెక్కును అందజేశారు.
అయితే, శ్రీలంకకు అవార్డుల ప్రదానం పూర్తయిన తర్వాత, ప్రసారం తిరిగి స్టూడియోలోని పోస్ట్-మ్యాచ్ షోకు మళ్లింది. శ్రీలంక క్రీడాకారిణులు తమ పురస్కారాలను స్వీకరిస్తున్న సమయంలో భారత జట్టు సభ్యులు వేదిక వద్ద లేరు. బహుమతి ప్రదానోత్సవం ప్రారంభానికి ముందు, టీమ్ ఇండియా ఆటగాళ్లు ఒకచోట చేరి చర్చించుకుంటూ ఉండగా, ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ వారికి దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో, మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు పట్టిన పేసర్ నందిని శర్మకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా , ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ‘ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్’ పతకాన్ని అందజేశారు. సైకియా ఆటగాళ్లతో మాట్లాడి, వారి విజయానికి అభినందనలు తెలిపారు. మ్యాచ్ అనంతర కార్యక్రమాలు మొదలయ్యాక, శ్రీలంక ఆటగాళ్లు ప్రముఖుల చేతుల మీదుగా రన్నరప్ పతకాలను అందుకున్నారు .కానీ భారత ఆటగాళ్లు ఎక్కడా కనిపించలేదు.