హైదరాబాద్ : లెక్కకు మించిన ఆఫర్లతో వినియోగదారులు పండుగ చేసుకుంటున్నారు. వీరి కోసం ఆన్ లైన్ సంస్థలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. పెరుగుతున్న వినియోగదారుల సంఖ్యతో ఆన్‌లైన్ పండుగ సీజన్ అమ్మకాలు రూ. 1.5 లక్షల కోట్లకు చేరనున్నాయి. వివిధ విభాగాలలో మొబైల్ ఫోన్ల వాటా తగ్గనుండగా, కిరాణా (గ్రోసరీ) వాటా పెరగనుంది. 2024 పండుగ సీజన్‌లో మొబైల్ ఫోన్ల వాటా 38 శాతంగా ఉండగా, 2025లో అది 35.2 శాతానికి తగ్గింది. అంచనాల ప్రకారం ఈ ఏడాది అది మరింత తగ్గి 29.8 శాతానికి పడిపోనుంది. మరోవైపు కిరాణా విభాగం వాటా 2024లో 5 శాతంగా ఉండగా 2025లో 7 శాతానికి పెరిగింది ఈసారి అది మరింత పెరిగి 9.5 శాతానికి చేరుతుందని అంచనా. ఈ వృద్ధికి అత్యంత వేగవంతమైన డెలివరీ సేవలు ప్రధాన కారణం కావచ్చు; ఇందులో సగటు ఆర్డర్ విలువ సుమారు రూ. 620 గా ఉంది. గత ఏడాది 12 శాతంగా ఉన్న కిరాణా వాటాలో ఈ విధానం 16 శాతం వాటాను ఆక్రమిస్తుందని అంచనా.
ఆన్‌లైన్ పండుగ సీజన్ అమ్మకాలు ఈ ఏడాది రూ. 1,50,000 నుంచి రూ. 1,55,000 కోట్లకు పెరుగుతాయని అంచనా . ఇది 2025లోని రూ. 1,20,000 కోట్లతో పోలిస్తే 25 నుండి 29 శాతం ఎక్కువ. అయితే, సుమారు ఒక నెల వ్యవధిలో అదనంగా రానున్న రూ. 30,000 కోట్ల అమ్మకాలు అధిక సంఖ్యలో ఉన్న వినియోగదారుల నుండి వస్తాయి, ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే సగటు ఆర్డర్ విలువ తగ్గుతుందని అంచనా. పండుగ సమయంలో షాపింగ్ చేసేవారి సంఖ్య గత ఏడాది 138 మిలియన్ల నుండి ఈ ఏడాది 158 మిలియన్లకు పెరగనుంది. దీనివల్లనే సుమారు రూ. 17,400 కోట్ల కొత్త అమ్మకాలు సమకూరవచ్చు. ఒక్కో వినియోగదారుడు చేసే ఆర్డర్ల సంఖ్య 5.51 నుండి 6.12కి పెరగవచ్చు, దీని విలువ మరో రూ. 15,114 కోట్లుగా ఉంటుంది. గత ఏడాది నమోదైన 760 మిలియన్ల ఆర్డర్లతో పోలిస్తే, ఈ సీజన్‌లో 966 మిలియన్ల ఆర్డర్లు నమోదయ్యే అవకాశం ఉంది . ఇది 27.1 శాతం పెరుగుదల. డేటం ఇంటెలిజెన్స్ అధ్యయనం ప్రకారం సగటు ఆర్డర్ విలువ రూ. 1,578 నుండి రూ. 1,554కు తగ్గుతుందని, పండుగ సీజన్ అమ్మకాలలో అదనంగా రూ. 30,226 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా.