శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

15 నుండి 23వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు 15 నుండి 23వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుమ‌ల : తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడారు. సెప్టెంబరు 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా జరుగనున్నాయని, ఇందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లన్ని పూర్తి చేసిన‌ట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆగమాను సారంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజా సామగ్రిని శుద్ధి చేసినట్టు చెప్పారు.

కాగా ఆలయంలో ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామి వారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూల విరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు . ఈ కార్యక్రమంలో పలువురు బోర్డు సభ్యులు, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈవో భాస్కర్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!